పచ్చ కండువా కప్పుకుంటున్న కిషోర్ చంద్రదేవ్

అమరవాతి, ఫిబ్రవరి 24 : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ నేడు టిడిపిలో చేరబోతున్నారు.

పార్టీలో చేరికపై ఇప్పటికే ప్రకటన చేసిన కిషోర్ చంద్రదేవ్ ఆదివారం ఉదయం 11.30గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా వైసిపికి రాజీమానా చేసిన కాకినాడ సీనియర్ నాయకుడు చలమలశెట్టి సునీల్ టిడిపిలో చేరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

2009లో ప్రజారాజ్యం తరుపున, 2014లో వైసిపి తరుపున కాకినాడ ఎంపి స్థానానికి పోటీ చేసి పరాజయం పాలైన చలమలశెట్టి సునీల్ ఈ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేయాలని ఆశక్తి చూపుతున్నట్లు సమాచారం.

తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని సునీల్ చంద్రబాబును కోరినట్లు తెలుస్తుంది. సునీల్ చంద్రబాబుతో సమావేశం కాక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా కలిశారు. అధికార తెలుగుదేశం పార్టీలోనే చేరేందుకు సునీల్ మొగ్గుచూపుతున్నారని సమాచారం. త్వరలోనే సునీల్ టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.