కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19వ తేదీ నుండి ఆమె ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై విశ్వభారతి ఆసుపత్రి యాజమాన్యం ఇవేళ ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. లక్ష్మమ్మ కార్డియో సమస్యలతో బాధపడుతున్నారని, బీపీ తక్కువగా ఉందని, ఏమి తినలేకపోతున్నారని పేర్కొన్నారు. వాంతులు అవుతున్నాయని చెప్పారు. మెదడుకు, పొట్టకు అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉందని, ఆమె ఇంకా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఇంకా కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి పేర్కొన్నారు. లోబీపీ కారణంగా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు ప్రకటించారు.

మరో పక్క వివేకా హత్య కేసులో ఇవేళ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హజరు కావాల్సి ఉంది. అయితే తన తల్లి ఆరోగ్యం కారణంగానే హజరు కాలేకపోతున్నానని సీబీఐకి అవినాష్ రెడ్డి సమాచారం అందించారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకోని సీబీఐ అధికారులు కర్నూలు లోని విశ్వభారతి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. మరో పక్క అవినాష్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీని కలవడంతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతుండటంతో కర్నూలులో హైటెన్ష్ పరిస్థితి నెలకొంది. మరో పక్క అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
YS Viveka Case: కర్నూలులో హైటెన్ష్ .. అవినాష్ రెడ్డి కోసం కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం