`బండి`కి పొగ‌పెడుతున్నారా? కిష‌న్ రెడ్డి మాట‌ల అర్థం ఏంటి?

ఓ వైపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీ హాట్ ఫేవ‌రెట్‌గా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీకి స‌రైన ప్ర‌త్య‌ర్థిగా కాషాయ పార్టీని ప్ర‌జ‌లు భావిస్తుండ‌గా మ‌రోవైపు ఆ పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

 

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు కీల‌కంగా మారాయి. ఇదే స‌మ‌యంలో పార్టీ నేత‌లు అంత‌ర్గ‌తంగా దీనిపై ఆస‌క్తిక‌రంగా మారాయి.

కేటీఆర్ నిప్పుల వ‌ర్షం…

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ రొహింగ్యాల ఏరివేతకు సర్జికల్‌ స్ట్రయిక్‌ నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నాలుగు ఓట్లు రెండు సీట్ల కోసం ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయాలా? అని ప్రశ్నించారు. సంజయ్ వ్యాఖ్యలను హోం శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి సమర్థిస్తారా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పచ్చని హైదరాబాద్‌ను ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రయిక్ చేస్తుందట బీజేపీ, సర్జికల్ స్ట్రయిక్ చేయడానికి హైదరాబాద్.. దేశ సరిహద్దుల్లో లేదు శత్రుదేశంలో అంతకన్నా లేదు అని ఆయన అన్నారు. పరుగులు పెడుతున్న దేశాన్ని అడ్డంగా పడుకోబెట్టిన వాళ్లపై చేయండి సర్జికల్ స్ట్రయిక్ అంటూ ఆయన విమర్శించారు. ఇవి మీకు చేతకాదా అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది అని ఆయన అన్నారు. అందుకే..మీ అసమర్థత పాలన పై దేశ ప్రజలు చేస్తారు…సర్జికల్ స్ట్రయిక్ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. వెనకబాటుతనంపై చేయండి సర్జికల్ స్ట్రయిక్, మత విద్వేషాలపై చేయండి సర్జికల్ స్ట్రయిక్, ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్న.. వారిపై చేయండి సర్జికల్ స్ట్రయిక్ తప్పుడు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన వాళ్లపై చేయండి సర్జికల్ స్ట్రయిక్ అంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు.

 

కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు ….

మంత్రి కేటీఆర్ వ‌రుస ట్వీట్ల నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‍రెడ్డి స్పందించారు. హైదరాబాద్ ఎన్నికల్లో జనం బీజేపీ వైపు ఉన్నారు. బీజేపీ సమర్థవంతంగా దేశాన్ని ప‌రిపాలిస్తోందని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో కూడా సమర్థవంతంగా పాలిస్తాం అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థుల కోసం ఉదయం నుంచి ప్రచారంలో ఉన్నా..సంజయ్ ఏం మాట్లాడారో…కేటీఆర్ ఏం ట్వీట్ చేశారో తెలియదు.. అంటూ కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.