తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మక సవాల్‌గా మారనున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ , ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ సమయంలో, ఇప్పటికే అధికార, విపక్షాలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి.
గత ఏడాది ఒంటి చెత్తో టీఆర్ఎస్ను గెలిపించిన మంత్రి కేటీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. ఇదే సమయంలో మరో కోణంలో కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారని అంటున్నారు. ప్రముఖ వ్యాఖ్యత సుమను తమ ప్రచారం పర్వంలో ఉపయోగించుకున్నారని చెప్తున్నారు.
సుమతో చిట్ చాట్ సైతం ….
మంత్రి కేటీఆర్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను ప్రముఖ వ్యాఖ్యాత సుమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సంభాషించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటీఆర్, ఆయన బృందం కృషి చేస్తున్న తీరు అద్భుతమని పేర్కొన్నారు. `కేటీఆర్ సర్‌తో సంభాషించడం ఆనందంగా ఉంది. ఓ హైదరాబాదీగా మన నగరం, అభివృద్ధి, తదుపరి చర్యల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మీకు, మీ బృందానికి కుడోస్ సర్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నేను షోలలో గడగడ ఆపకుండా మాట్లాడుతుంటా.కానీ మీ (కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ) నాయకత్వం నన్ను శ్రద్ధగా వినేలా చేసింది. ప్రకటించడం.. అంకితభావంతో పనిచేయడం.. అమలు చేయడం మీ మార్గాలు. సూపర్ సర్..’ అని సుమ ట్వీట్ చేశారు.
కేటీఆర్ సైతం…
కాగా , సుమ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. “మీతో సంభాషణను నేను సైతం ఆస్వాదించాను. ఈ ఇష్టాగోష్టిగా మీరు ప్రసారం చేసిన అనంతరం వీక్షకులు సైతం అదే రీతిలో ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. “ అని పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ఇంటర్వ్యూను త్వరలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చర్చాగోష్టిలో భాగ్యనగర అభివృద్ధితోపాటు వివిధ అంశాల గురించి కేటీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం. ఇవి టెలికాస్ట్ అయిన సమయంలో గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ చేసిన పనుల గురించి వివరిస్తారని చెప్తున్నారు. తద్వారా పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపేలా చేసుకుంటున్నారని అంటున్నారు.