Adani Row in Parliament Session: హిండెన్ బర్గ్ నివేదికతో భారీగా కుప్పకూలుతున్న ఆదానీ గ్రూప్ షేర్ల ఎఫెక్ట్ రెండో రోజు పార్లమెంట్ పై పడింది. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంబించాయి. ఆదానీ గ్రూపు తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది కాస్తా పార్లమెంట్ లో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. దాంతో వాయిదా పర్వం కొనసాగింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ పార్టీల అభ్యర్ధనలను లోక్ సభ స్పీకర్ నిరాకరించారు.

మరో వైపు రాజ్యసభలోనూ విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ్యులు నినాదాలు చేశారు. శుక్రవారం ఇరు సభలు ప్రారంభం కాగానే ఆదానీ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ సజావుగా జరిగేలా చూడాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ చేసిన విజ్ఞప్తులను సభ్యులు పట్టించుకోకుండా ఆందోళన చేపట్టారు. సభలో గందరగోళం చెలరేగడంతో తొలుత ఇరు సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైనా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు.
BBC Documentary row: డాక్యుమెంటరీ నిషేదంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు