కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే లోక్ సభ సెక్రటేరియట్ సెర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ చర్యలను కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు ఖండిస్తున్నాయి. మరో పక్క ఉభయ సభల్లోనూ విపక్షాల ఆందోళన చేస్తున్నాయి. దీంతో సభలు సజావుగా జరిగే పరిస్థితి లేక వాయిదా పడుతున్నాయి.

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీకి లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసు జారీ చేసింది. రాహుల్ ఉంటున్న బంగాళను ఖాళీ చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత వేటు పడటంతో రాహుల్ గాంధీ ఉంటున్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని తెలిపింది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని పన్నెండో నెంబర్ ఇంటిని రాహుల్ ఖాళీ చేయాలని కోరింది. వచ్చే నెల (ఎప్రిల్) 22వ తేదీ లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొంది లోక్ సభ హౌసింగ్ ప్యానెల్. అదే చివరి తేదీ అని పేర్కొంది.
2019 ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే హైకోర్టును ఆశ్రయించేందుకు శిక్ష అమలును నెల రోజులు వాయిదా వేస్తూ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే కోర్టు ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోపే ఆయనపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఆయన ఉంటున్న ప్రభుత్వ బంగాళా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.