ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై లోక్ సభలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం స్పీకర్ సుమిత్రమహాజన్ ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 245, వ్యతిరేకంగా  11 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లును లోక్ సభ ఆమోదించినట్లైంది.

కాగా బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించలేదు.  బిల్లుకు ఎంఐఎం సభ్యుడు ఒవైసీ ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. కాగా బిల్లును వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే, కాంగ్రెస్ లు వాకౌట్ చేశాయి. బిల్లు అత్యంత ముఖ్యమైనదనీ, దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంది కనుక స్టాండింగ్ కమిటీకి పంపాలని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష సభ్యుల నినాదాల మధ్యనే సభలో చర్చ కొనసాగింది. చివరకు ఓటింగ్ జరిగి బిల్లు ఆమోదం పొందింది.