తమిళ హీరో సూర్య అంటేనే ఇతర హీరోల కంటే చాలా ప్రత్యేకం. ఆయన సినిమాలు సైతం అలాంటివే. ఎందుకంటే సూర్య ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నీ కూడా విభిన్న కథాంశంతో వచ్చినవే. ఆయన సినిమాల్లో ఎదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా యాక్షన్ మాస్, క్లాస్ పాత్రల్లో ఒదిగిపోయి నటించడమే కాదు.. ఎమోషన్ల్ సీన్లతో ఆయన ప్రేక్షకుల కంట కన్నీరు సైతం తెప్పించగలరు.
అయన నటించిన ఆరు, సింగం, గజినీ, యముడు, సెవెన్త్ సెన్స్, 24 వంటి చిత్రాలే దానికి నిదర్శనం. కాగా, ఇటీవల ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్తా డీలా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఎలాగైన మరో బ్లక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో రియల్ స్టోరీని సినిమాగా చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సినిమాయే “ఆకాశం నీ హద్దురా”. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఆ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ నెలలోనే విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.
దీనిని “ఎయిర్ దక్కన్” సంస్థ స్థాపకులు జీఆర్. గోపీనాథ్ జీవితంపై రాసిన “సింప్లీ ఫ్లై” అనే పుస్తకంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రముఖ దర్శకులు సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో హీరో సూర్య అద్భుతంగా నటించారనీ, సుధా కొంగర డైరెక్షన్ సూపర్ అంటూ ప్రశంసలు వస్తున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖు సైతం ఈ సినిమా సూపర్ అంటూ కొనియాడుతున్నారు.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్.. సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు. ట్విట్టర్లో ఆయన సూర్య సినిమాపై స్పందిస్తూ.. “శూరారైపోట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా సినిమాను చూశారు. చాలా బాగుంది. ఈ చిత్రం స్పూర్తిదాయకమైనది. ఈ సినిమాలోని గోపీనాథ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటిచారు. ఇందులో ఆయన నటవిశ్వరూపాన్ని చూపించారు. సుధా కొంగర డైరెక్షన్ బ్రిలియంట్. ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు” అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్కొన్నారు. కాగా, సూర్య సినిమా పై మంచి టాక్ రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం లభిస్తుండటంతో సింగం అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.