Saving: కాఫీ తాగాలని కోరిక కలగగానే మీ కెఫెటేరియా లేదా బయట కాఫీ షాప్‌లోకి అడుగుపెట్టడం వల్ల.. డబ్బు ఖర్చు అవ్వడమే కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. దీనికి బదులు ఉదయం, సాయంత్రం.. రోజూ ఇంట్లో మంచి కాఫీ పెట్టుకొని తాగండి.ఇంకా వెరైటీ కావాలంటే అనేక రకాల వీడియోస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు కావలసింది మీరే సొంతంగా చేసుకుని తాగితే ఆ తృప్తే వేరు. ఇలా చేయడం వల్ల కొంత డబ్బు మిగులుతుంది. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్లి మీ ఫేవరెట్ కాపుచినో వంటివి తాగి రావొచ్చు.
రోజూ ఆఫీస్‌కి క్యాబ్‌లో వెళ్లే వారు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా ప్రయాణిస్తే కనుక ఈ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ మీ ఆఫీస్ ఉన్న చోటుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం సరిగ్గా లేదు అనుకుంటే, షేర్ క్యాబ్ తీసుకోండి. లేదా కార్ పూలింగ్ చేసుకోండి. దీనివల్ల తక్కువ ఖర్చు అవుతుంది. రోజూ ప్రయాణం చేసే వారికి ఓలా , ఊబర్ సంస్థలు పాస్‌లు అందిస్తున్నాయి. ఇందులో చాలా డిస్కౌంట్లు కూడా లభిస్తాయి కాబట్టి అలా కూడా ట్రై చేయవచ్చు.సూపర్ మార్కెట్‌కి నాలుగు వస్తువులు మాత్రమే కొనడానికి వెళ్లి.. పది వస్తువులు తీసుకుని తిరిగి రావడం మనలో చాలామంది కి ఉన్న అలవాటు. ఇందులో జంక్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అటు ఆరోగ్యానికి,ఇటు బడ్జెట్‌కి కూడా మంచిది కాదు. అందుకే సూపర్ మార్కెట్‌కి వెళ్లాలనుకున్నపుడు లిస్ట్ రాసుకుని ఇవి తప్ప ఇంకేమి తీసుకోకూడదు అని గట్టిగా సంకల్పించుకుని వెళ్లడం వల్ల చాలా డబ్బులు మిగులుతాయి.
మామూలుగా మనం తక్కువ ఖర్చుతో రీఛార్జ్ అయిపోవాలని.. మొబైల్ డేటా తక్కువగా వచ్చే ప్లాన్‌ని ఎంచుకుంటూ ఉంటాం. ఆ తర్వాత అది అయిపోగానే మళ్లీ డేటా అవసరం కాబట్టి.. మరోసారి రీఛార్జ్ చేస్తాం . ఇలా నెలకు ఒకటికి రెండుసార్లు రీఛార్జ్ చేయించడం వల్ల ఖర్చు పెరుగుతుంది. దీనికి బదులు ముందు కాస్త ఖర్చు ఎక్కువైనా కూడా ఎక్కువ రోజులు వచ్చేలా డేటా, టాక్ టైం రెండింటినీ అందించే ప్లాన్ చేసుకోవడం అనేది మంచి పద్దతి.