Mamata Banerjee: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన సువేందు అధికారి ,తనను వీడిపోయిన రాజీవ్ బెనర్జీల జుట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి చిక్కింది.మమతా బెనర్జీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వీరిద్దరూ మొన్నటి ఎన్నికల సందర్బంగా బిజెపిలోకి దూకేశారు.

వీరిలో సువేందు అధికారి ఆమెను నందిగ్రామ్ లో రెండు వేల ఓట్ల తేడాతో ఓడించారు కూడా.ఒంటి చేత్తో పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు ను మూడోసారి మళ్లీ అధికారంలోకి తెచ్చిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్వయంగా ఓడిపోవడం ఆమెకు అవమాన భారాన్ని మిగిల్చింది.పైగా ఈ ఇద్దరు మంత్రులను ఆమె గట్టిగా నమ్మారు ..వారిని తన సన్నిహితులుగా భావించారు.అయితే వారు బిజెపిలో చేరడంతో ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ఎన్నికల ప్రచారంలో వారిద్దర్నీ ద్రోహులుగా కూడా మమతా బెనర్జీ అభివర్ణించారు.ఇది జరిగి నెల రోజులు కాకముందే యాస్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ ను ముంచెత్తింది. దాదాపు నూట ముప్ఫై కరకట్టలు కొట్టుకుపోయాయి. ఆ ఇద్దరు “ద్రోహుల”పని పట్టడానికి ఇదే మమతా బెనర్జీకి ఆయుధంగా దొరికింది.
ఇలా దొరికింది ఆమెకు వారి పిలక!
రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బ తీయటానికి ఒక అవకాశం కోసం ఎవరైనా సరే ఎదురు చూస్తుంటారు.ఆ పనే ఇప్పుడు మమతా బెనర్జీ చేశారు.మమతా బెనర్జీ క్యాబినెట్లో రాజీవ్ బెనర్జీ, సువేందు అధికారి నీటిపారుదల శాఖ మంత్రులు గా పదేళ్లు కొనసాగారు.2011 నుండి 2018వరకు రాజీవ్ బెనర్జీ ,ఆ తరువాత గత ఏడాది డిసెంబర్ వరకు సువే౦దుఅధికారి నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నారు.వీరి హయాంలోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ కరకట్టలను నిర్మించారు.అవన్నీ ఇప్పుడు కొట్టుకుపోవడంతో మమతా బెనర్జీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.తద్వారా తన మాజీ సహచరులు ఇద్దరిని విచారణలో గట్టిగా ఇరికించేశారు.గురువారం నాడు మమతా బెనర్జీ యాష్ తుఫాన్ నష్టాలపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా తన దృష్టికి నీటిపారుదలశాఖ రంగానికి వాటిల్లిన నష్టం రావడంతో ఆమె గట్టిగా స్పందించారు.అయితే ఆమె ఆ ఇద్దరి మాజీ మంత్రుల పేర్లు ఎత్తకుండానే పటిష్టంగా నిర్మించామని చెబుతున్న ఈ కరకట్టల కొట్టుకుపోయాయి అంటే ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందంటూ వ్యాఖ్యానించారు.ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకొని కట్టిన బ్రిడ్జీలు కూడా కనిపించకుండా పోయాయి అంటే ఏం జరిగిందో అర్థమవుతుందన్నారు
ప్రజాధన౦ దుర్వినియోగాన్ని తాను సహించబోనని అన్ని కోణాల్లో విచారణ జరిపి నివేదిక సమర్పిస్తే బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే రాజీవ్ బెనర్జీ గానీ సుభేందు అధికారి గాని ఇప్పటివరకు ఈ విషయమై స్పందించలేదు.