హ‌త్య చేసి.. ప్లాస్టిక్ సంచిలో శవం.. చివరికి?

తెలంగాణాలో రోజురోజుకూ అదృశ్య‌మ‌వుతున్న‌వారి సంఖ్య పెరుగుతున్న‌ది. గ‌త వారం రోజుల్లోనే రెండు వంద‌ల మందికి పైగా మిస్సింగ్ కేసులు న‌మోదుకావ‌డంతో పాటు వీరిలో ప‌లువురి మృత దేహాలు వివిధ నిర్మ‌నుష్య ప్రాంతాలో వెలుగుచూడ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. నేప‌థ్యంలోనే ఇటీవ‌ల క‌నిపించ‌కుండా పోయిన ఓ ప్ర‌యివేటు ఉద్యోగిని మృత దేహం కనిపించింది.

ఆ ఉద్యోగిని అతికిరాత‌కంగా హ‌త్య చేసి.. ఓ ప్లాస్టిక్ సంచిలో మూట‌గ‌ట్టి నిజ‌మాబాద్ లోని ఓ అడ‌వి ప్రాంతంలో ప‌డేసిపోయిన ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ నెల 27న స్థానికులు మృత దేహాన్ని గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. మోపాల్ మండ‌లం మంచిప్ప గ్రామ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతంలోని ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకుని ప‌రిశీలించారు. అతి దారుణంగా హింసించి ఆ వ్య‌క్తి ప్రాణాలు తీసిన‌ట్టుగా తెలుస్తోంది. మృత దేహం కుళ్లిపోయి దుర్వాస‌న రావ‌డంతో స్థానికులు గుర్తించారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. మ‌రీ ముఖ్యంగా మృత దేహంపై క‌త్తిపోట్టు ఉండ‌టం, అతి క్రూరంగా హింసించిన‌ట్టు తెలిపే గాయాలు ఉండ‌టంతో పోలీసులు మ‌రింత సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ ప్రాంతం చుట్టూప‌క్క‌ల పరిస‌రాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని ప‌రిశీలించ‌గా.. ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ మృత దేహాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో మూట‌క‌ట్టి… దానిని తమ బైక్ పై పెట్టుకుని అట‌వీ ప్రాంతం వైపు వెళ్తున్న దృశ్యాల‌ను పోలీసులు గుర్తించారు. ఆ దుండ‌గులు ఎవ‌ర‌నేదానిపై పోలీసులు వెతుకుతున్నారు.

కాగా, మృతుడిని నిజ‌మాబాద్ జిల్లాలోని సాయిన‌గ‌ర్‌కు చెందిన ప్ర‌యివేటు ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. అత‌ను స్థానికంగా ఉన్న ప్లాస్టిక్ వ‌స్తువ‌ల త‌యారీ ప‌రిశ్ర‌మలో సేల్స్ మెన్‌గా ప‌నిచేస్తున్నాడు. ఓ సాధార‌ణ వ్య‌క్తిని ఇంత దారుణంగా చంపాల్సిన అవ‌స‌ర‌మేముంటుద‌నే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఇదివ‌ర‌కు ఎవ‌రితోనైన క‌ల‌హాలు ఉన్నాయ అనే కోణంలోనూ విచార‌ణ జ‌రుపుతున్నారు.