యూపీలో పొత్తులు ఫైనల్

43 views

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌‌లో బహుజన్ సమాజ్ వాది పార్టీ, సమాజ్ వాది పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. గురవారం బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఎస్‌పి అధినేత అఖిలేశ్‌ యాదవ్‌‌‌లు సీట్ల పంపకాలపై ప్రకటన విడుదల చేశారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా.. బిఎస్‌పి 38 స్థానాల్లో, ఎస్‌పి 37 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

అంతేకాదు ఇరు పార్టీల్లో.. ఏ పార్టీ ఏ నియాజకవర్గంలో పోటీచేస్తున్నది వెల్లడించారు. వారణాసిలో మోదీపై ఎస్‌పి పార్టీ అభ్యర్థి పోటీచేయనున్నారు. యూపీ సీఎం గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌లోనూ ఎస్‌పి అభ్యర్థి బరిలో దిగనున్నారు. అలాగే గతంలో మాయావతి చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు విడిచి పెట్టారు. అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి మూడు సీట్లు కేటాయించారు. గతంలో చెప్పిన స్థానాలకంటే ఒక స్థానం తక్కువగా ఎస్‌పి ఎన్నికల బరిలో నిలుస్తున్నది.

కొన్ని రోజుల క్రితం పొత్తు, సీట్ల పంపకాల గురించి సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈ రెండు పార్టీలు..మొత్తం 80 స్థానాల్లో.. బిఎస్‌పి 38 ,ఎస్‌పి 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. మిగిలిన వాటిలో ఆర్‌ఎల్‌డి పార్టీకి రెండు సీట్లు.. అమేథి, రాయ్‌బరేలి స్థానాల్లో గాంధీ ఫ్యామిలీకి పట్టు ఉండటంతో ఆ రెండు స్థానాలని కాంగ్రెస్‌కు విడిచిపెట్టినట్లు చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బలం లేదని, అందుకే పొత్తు విషయమై వారితో చర్చించలేదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ తో పొత్తుకు ఈ రెండు పార్టీలు సుముఖత వ్యక్తం చేయకపోవటంతో రాహుల్ గాంధీ తమ పార్టీ మొత్తం 80 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రాహుల్ ఈ ప్రకటన చేసినప్పటికీ ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటంతో మాయావతి పొత్తుపై పునరాలోచన చేసే అవకాశం ఉందని ఆ పార్టీలో కొందరు నేతలు భావించారు. కానీ ఈ రెండు పార్టీలు సీట్ల పంపకాలపై ప్రకటన విడుదల చేశాయి.