సెంట్రల్ ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబాయి, డిసెంబర్ 29: సెంట్రల్ ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమల మిల్స్ సముదాయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఐదు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నెలలో ముంబాయిలో జరిగిన మూడో  అగ్ని ప్రమాదం ఇది. డిసెంబర్ 17న అంధేరిలో ఐదు అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగగా పది  మంది మృతి చెందారు. 27న చెంబూర్‌లో  ఒక భవంతిలో అగ్ని ప్రమాదం జరగ్గా ఐదుగురు మృతి చెందారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 14మంది మృతి చెందారు. వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.