మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 152వ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు గోవింద ఆచార్య అనేది టైటిల్ అని ఇప్పటికే రివీల్ అయింది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఆగష్టు 22న పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆ రోజున మెగా అప్డేట్ రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను ఆగష్టు 22న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక స్పెషల్ పాత్రలో మెరవబోతున్న విషయం ఇప్పటికే అధికారికమైంది. చిరంజీవి, రామ్ చరణ్ ఈ చిత్రంలో గురు శిష్యులుగా నటించబోతున్నట్లు స్వయంగా చిరంజీవి రివీల్ చేసారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నా కానీ తర్వాత ఆమె వాకౌట్ చేయడంతో కాజల్ ను తీసుకున్నారు. రెజీనా ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో నర్తించింది. రెజీనాకు సంబంధించిన షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు.
అక్టోబర్ నుండి షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గోవింద ఆచార్య తర్వాత చిరంజీవి వరస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెల్సిందే. లూసిఫెర్ రీమేక్, దర్శకుడు బాబీతో సినిమా, మెహర్ రమేష్ తో మరో సినిమాను చిరంజీవి కన్ఫర్మ్ చేసారు. ఆగష్టు 22న గోవింద ఆచార్య అప్డేట్ తో పాటు దాని తర్వాతి చిత్రం గురించి కూడా అధికారిక సమాచారం బయటకు వచ్చే అవకాశముంది. మరి ఆరోజు ఇంకేమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.