Kanna Babu Raju : పంచాయతీ ఎన్నికల్లో పోటికి దిగిన ప్రత్యర్థులను వైసిపి ఎమ్మెల్యే బెదిరించిన రెండు చోట్లా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది.

ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు నోటిదురుసుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికలలో నియోజకవర్గ పరిధిలోని అత్యధిక పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినా…కొన్నిచోట్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. రాంబిల్లి మండలం రాజకోడూరులో ఎమ్మెల్యే బలపరిచిన చిరంజీవిపై వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి ముత్తా శంకరరావు విజయం సాధించారు. ఇక్కడ పది వార్డులకు తొమ్మిది వార్డులు శంకరరావు వర్గీయులు కైవసం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబు తనదైన శైలిలో బెదిరించారు. తాను సూచించిన వ్యక్తినే సర్పంచ్‌గా గెలిపించాలని, ఒకవేళ ప్రత్యర్థి గెలిచినా పంచాయతీ కుర్చీలో కూర్చొనివ్వబోనన్నారు. ప్రజలు తను బలపర్చిన అభ్యర్థిని గెలిపించకుంటే వారికి సంక్షేమ పథకాలు అందవన్నారు. ముఖ్యమంత్రి జగన్ మాదిరే తను తన నియోజకవర్గంలో అంతని ఎమ్మెల్యే చెప్పుకున్నారు.తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయంటూ చాలా విపరీత ధోరణిలో ఆ పంచాయితీ ఓటర్లను ఎమ్మెల్యే బహిరంగంగానే బెదిరించారు.అయితే ప్రజలు బెదిరిపోలేదు.తాము మెచ్చిన వ్యక్తిని గెలిపించుకున్నారు.ఎమ్మెల్యేని బేఖాతరు చేశారు
Kanna Babu Raju : అక్కడా ఇదే జరిగింది!
ఇదే తరహాలో వెల్చూరు పంచాయతీ వీఆర్ అగ్రహారంలో బెదిరించారు. అక్కడ పంచాయతీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తన ప్రత్యర్థి వర్గానికి చెందిన అభ్యర్థి అల్లుడుకు ఎమ్మెల్యే కన్నబాబు ఫోన్ చేసి బెదిరించిన ఆడియో టేపు వైరల్ అవడం తెలిసిందే .తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తే అక్కడ తిరగ లేవంటూ కూడా ఎమ్మెల్యే ఆయనను బెదిరించారు. అయితే వెల్చూరులో కన్నబాబు బలపరిచిన అనకాపల్లి సీతపై ప్రత్యర్థి వర్గానికి చెందిన కిల్లాడ మంగాయమ్మ విజయం సాధించారు.ఇక మునగపాక మండలంలో ఇప్పటివరకు నాగవరం, ఆనందపురం, మూలపేట, అరబుపాలెం, రాజుపేట, గంటవాని పాలెంలో గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ వర్గీయులు విజయం సాధించి ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. మునగపాకలో 14 వార్డులను ప్రసాద్ వర్గీయులు విజయం సాధించారు. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే బెదిరింపులు పని చేయలేదు సరికదా ఆయన ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది.