కొద్ది గంటల్లో ఏపి అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ లో తీవ్ర టెన్షన్ నెలకొని ఉంది. స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మూడు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు చేజారిపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకుంది. వాస్తవానికి అసెంబ్లీలో ఉన్న నైతిక బలంతో ఏడు అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవశం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఒక్క ఎమ్మెల్యే చేజారినా వైసీపీ సర్కార్ అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తుందన్న భయంతో జాగ్రత్తలు పాటిస్తొంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను తీసుకువచ్చి ఓటు వేయించే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగించింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు గెలుపొందేందుకు అవసరమైన బలం ఉంది. అయితే అసెంబ్లీలో నైతికంగా బలం లేకపోయినా టీడీపీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధను బరిలోకి దింపడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీంతో వైసీపీ అప్రమత్తమైంది. ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు గానూ 8 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. ఏపి అసెంబ్లీలో గురువారం (23వ తేదీ) ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ మొదలు అవుతోంది.

ఇరు పార్టీలకు ఒక్క ఓటే కీలకం
టీడీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ నాలుగురు వైసీపీ గూటికి చేరారు. దీంతో ఏపి అసెంబ్లీలో టీడీపీ బలం 19కి పడిపోయింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్ధి నెగ్గాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు అనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీ నుండి దూరం జరిగారు. వీరు అధికారికంగా టీడీపీలో చేరకపోయినా ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తామని తెలియజేయడంతో వీరు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓటు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకా వైసీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైనా ఒకరు టీడీపీ అభ్యర్ధికి ఓటు వేస్తే పంచుమర్తి అనురాధకు విజయావకాశాలు ఉంటాయి. టీడీపీ ప్రలోబాలకు తెరతీసే అవకాశం ఉందని భావించి వైసీపీ ముందుగానే అలర్ట్ అయ్యింది. ఇక వైసీపీ విషయానికి వస్తే ఇద్దరు అసంతృప్తి ఎమ్మెల్యేల (ఆనం, కోటంరెడ్డి)ను పక్కన బెడితే 149 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి తోడు టీడీపీ నుండి గెలిచి వైసీపీకి మద్దతు పలికిన నలుగురితో పాటు జనసేన నుండి గెలిచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద్ తో కలుపుకుంటే అసెంబ్లీలో వైసీపీ బలం 154గా ఉంది. వీరిలో ఒక్కరూ చేజారకుండా ఉంటే ఏడుగురు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు గెలుపు ఖాయమే.
మంత్రులకు బాధ్యతలు
అసెంబ్లీలో నైతికంగా బలం లేకపోయినా టీడీపీ అభ్యర్ధిని రంగంలోకి దింపడంతో వైసీపీ అప్రమత్తమైంది. వైసీపీ నుండి మరో ఓటు పడుతుందన్న ఆశలో టీడీపీలో ఉంది. దీంతో ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా వైసీపీ జాగ్రత్తలు పాటిస్తొంది. ఎమ్మెల్యేలను టీమ్ లుగా విభజించి కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఎవరైనా ఎమ్మెల్యేలు గీత దాడతారా అనే దానిపై ఇంటెలిజెన్స్ ద్వారా ఆరా తీస్తొంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎత్తులు, వైసీపీ పై ఎత్తులు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ పార్టీ నేతల మంత్రాంగాల నేపథ్యంలో విజయవాడ ఫైస్టార్ హోటల్స్ పార్టీ నేతలతో కళకళలాడుతున్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల రివ్యూ సందర్భాల్లో పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రశక్తి లేదంటూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కరాఖండిగా చెబుతుండటంతో పార్టీలో టికెట్ రాదు అని డిసైడ్ అయిన వారు ఎవరైనా టీడీపీకి ఓటు వేసే ఛాన్స్ ఉందని టీడీపీ ఆశపడుతోంది. చూడాలి ఏమి జరుగుతుందో.