మోదీ ఏపీ టూర్ వాయిదా!

రాష్ట్ర బీజేపీ శ్రేణుల ఆశలు, ఉత్సాహంపై నీళ్లు చల్లే వార్త ఇది. వచ్చే నెల 6వ తేదీన ఏపీలో ప్రధాని పర్యటనకు సర్వసన్నాహాలూ చేస్తున్న బీజేపీ శ్రేణులను ఆయన పర్యటన వాయిదా పడిందన్న వార్త తీవ్ర నిరాశకు గురి చేయక మానదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న తీరుతో ఇప్పటికే డీలా పడ్డ బీజేపీ శ్రేణులు మోదీ పర్యటన వాయిదా పడటంతో మరింత నిస్తేజానికి గురి కావడం ఖాయం. మోడీ పర్యటనతో రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని  నింపాలన్న పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఈ వార్త శరాఘాతం వంటిదే.

తొలుత  మోదీ పర్యటన వాయిదా పడిందన్న వార్తలు వెలువడినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడిందనీ, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో ఆయన పర్యటన ఉంటుందనీ పీఎంవో ప్రకటించింది. మొత్తం మీద మోదీ పర్యటన వాయిదాకు కారణం ఇదీ అన్నది ఇతమిథ్ధంగా తెలియరాలేదు. అయినా కేరళలో ఆయన పర్యటన షెడ్యూల్ లో మార్పుల వల్లే ఏపీ టూర్ వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా మోదీ పర్యటన సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేయాలనీ, తాను కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయనను కలవాల్సి ఉన్నా కలిసేది లేదనీ, రాష్ట్రప్రభుత్వం తరఫున ఆయన పర్యటనకు ఎలాంటి సహకారం లభించదనీ చంద్రబాబు చేసిన ప్రకటన నేపథ్యంలో మోదీ పర్యటన వాయిదా పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.