ఏపీకి వచ్చే నైతిక హక్కు మోదీకి లేదు – గంటా

తిరుపతి, డిసెంబర్ 25: గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏపీకి వచ్చే నైతికహక్కు ప్రధాని నరేంద్ర మోదీకి లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.   మంగళవారం ఆయన వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకోగా తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శిచుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ జనవరి 6న ప్రధాని గుంటూరుకు రానున్నట్లు తెలిసిందని, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను ఆమలు చేయని ఆయనకు ఏపీకి వచ్చే నైతిక హక్కు లేదన్నారు. కాగా తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్శింహరెడ్డి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్మాదమ్ముల్లా కలసి అభివృద్దిచెందాలని ఈ సందర్బంగా ఆయన ఆకాంక్షించారు.