మోడీ సర్కార్ మాఇళ్లల్లోకి చొరబడుతోంది!

ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రం తీరును పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. విపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం పొందిన తీరును ఆమె ఆక్షేపించారు. మోడీ సర్కార్ తమ ఇళ్లల్లోకి చొరబడుతున్నట్లుగా ఉందని ఆమె అన్నారు.

ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆమె ప్రస్తుతం ఉన్న పద్ధతిలో ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా రూపొందితే ముస్లిం కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ముస్లిం మహిళలు, పురుషులూ కూడా అన్ని విధాలుగా అవస్థలు పడతారనీ, ముస్లిం మహిళల రక్షణ కోసమే అని కేంద్రం చెబుతున్నప్పటికీ దీని వల్ల ముస్లిం మహిళలకు భద్రత, రక్షణా లేకుండా పోతుందని మెహబూబా ముఫ్తీ అన్నారు. రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించాల్సిందిగా ఆమె పార్టీలకు విజ్ణప్తి చేశారు. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించకుండా, ఏకపక్షంగా బిల్లును తీసుకురావడం మోడీ సర్కార్ నియంతృత్వ ధోరణిని నిదర్శనమని మెహబూబా ముఫ్తీ విమర్శించారు.