జోరు పెంచిన మోదీ

ఇక ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో టిడిపి సంగతి చూడాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. వరస వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఆయన రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలను రానున్న పోరాటానికి సమాయత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం కడప, కర్నూలు, తిరుపతి, నర్సరావుపేట నియోజక వర్గాల కార్యక్తర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల జోరు పెంచారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టదని ఆయన వ్యాఖ్యానించారు.

ఎపిలో కుల రాజకీయాలు, అవినీతి పెచ్చుమీరి పోయాయన్న ప్రధాని, వాటికి చరమ గీతం పాడాలని కోరారు. రాష్ట్రంలో కేంద్రం సహాయానికి కొదవ లేదనీ, ఈ విషయంలో టిడిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలనీ ఆయన కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. టిడిపి దాడులకు భయపడాల్సిన పని లేదనీ, ఓటమి భయం పట్టుకున్నపుడు దాడులకు దిగుతారనీ మోదీ వ్యాఖ్యానించారు.