అయ్యప్పను దర్శించింది ఇద్దరు కాదు 51మంది

ఢిల్లీ, జనవరి 18: శబరిమల అయ్యప్పను ఇద్దరు కాదు…51మంది మహిళలు దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం నివేదిక అందజేసింది.

తొలి సారి అయ్యప్పను దర్శించుకుని రికార్డు సృష్టించిన బిందు, కనకదుర్గలు తమకు రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం సుప్రీంలో విచారణ నిర్వహించారు.

ఈ ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ ఇద్దరు మహిళలే కాదు.. మొత్తం 51మంది మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనానికి వెల్లడించింది. అయ్యప్పను దర్శించుకున్న మహిళల జాబితాను కోర్టుకు సమర్పించింది.

వీరికి రక్షణ కల్పిస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది వివరించారు.

అన్ని వయస్సుల వారు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ  కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకత్వంలో హిందుత్వవాదులు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నారు.