ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారా? : ఎంపీ గల్లా

‘ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటారా’ అని టిడిపి ఎంపి గల్లా జవదేవ్ ప్రశ్నించారు. పుల్వామా ఘటనపై ఆయన బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. శనివారం ఆయన టిడిపి ఎమ్ ఎల్ సి బుద్దా వెంకన్న, టిడిపి ఎమ్ ఎల్ ఏ బోండా ఉమా తో కలిసి ప్రెస్ మీట్ లో మీడియా తో మాట్లాడారు.

కశ్మీర్ లో కావాలనే రాష్ట్రపతి పాలన తీసుకువచ్చారు అని గల్లా ఆరోపించారు. జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు అన్ని పీఎం చేతిలోనే ఉన్నాయని అన్నారు. ఆర్మీ వాళ్ళు విమానంలో వెళ్లాలని కోరినా ప్రభుత్వం అనుమతించలేదన్నారు. నిఘా వైఫల్యం, ప్రొసీజర్ లాప్స్ ఉన్నాయి అని ఆరోపించారు. వైఫల్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటున్నారని అన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల ఉగ్రదాడి జరిగిందని,అప్పుడు మన్మోహన్ రాజీనామా చేయాలని.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోది డిమాండ్ చేశారని గల్లా గుర్తు చేశారు.

3.10 కి దాడి జరిగితే 6.40 వరకూ ప్రధాని ఎందుకు స్పందించలేదని గల్లా ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని గైర్హాజరు కావటం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేశారు. రాజకీయం చేయొద్దంటూనే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాశ్మీర్ ప్రజలు భారతీయిలు కాదన్న మేఘాలయ గవర్నర్ ను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారని, పాకిస్థాన్ ప్రధానిని ఆయన విశ్వసిస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అమిత్ షా క్షమాపణ చెప్పాలని గల్లా డిమాండ్ చేశారు.

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాతో వైకాపా అధ్యక్షుడు జగన్ లండన్‌లో రహస్య భేటీ అయ్యారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయ్ మాల్యాతో రహస్య భేటీ విషయాలు జగన్ బయటపెట్టాలి అని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. జగన్ కూతురు కోసమే లండన్ వెళ్లాడంటే నమ్మే పరిస్థితి లేదన్నారు. హవాలా సొమ్మును పార్టీ ఫండ్స్ పేరుతో తరలించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారని బుద్ధా ఆరోపించారు.

జగన్‌కు నిజాయతీ ఉంటే లండన్‌లో ఎవరెవరిని కలిశారో ప్రజలకు తెలియజేయాలన్నారు.  నిన్న చెన్నైలోని ఓ హోటల్‌లో బిజెపి నాయకురాలు పురందేశ్వరి, తెరాస నేత సంతోష్‌ రెడ్డి, వైకాపా నేత సుబ్బారెడ్డి, సినీ నటుడు మోహన్ బాబు రహస్య భేటీ జరిగిందని, ఎన్నికల్లో ఫండింగ్ కోసమే ఈ రహస్య భేటీ జరిగిందని బుద్ధా ఆరోపించారు. జగన్,మోది,కేసిఆర్ కలిసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తున్నారని బుద్ధా విమర్శించారు. హోదాపై మాట తప్పిన ప్రధాని సిగ్గు లేకుండా ఏపీకి ఎందుకు వస్తున్నారు…? అని బుద్ధా ప్రశ్నించారు.

జగన్ లండన్ పర్యటనపై కేంద్రం స్పందించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జగన్ లండన్ వెళ్ళింది విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తరలించేందుకే అని, అందుకు కేంద్రం, మోది సహకారం ఉందని ఉమా ఆరోపించారు. నల్ల ధనం తరలింపుపై విచారణ కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఓటమి భయంతో జగన్ టిడిపి చేస్తున్న సర్వేలపై బురద జల్లుతున్నాడు అని ఉమా ఆరోపించారు.