ఎంపీలో ఓబిసిలకు కాంగ్రెస్ గాలం

మధ్యప్రదేశ్, మార్చి 10 : మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓబిసి రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ శనివారం ఆర్డినెన్సును జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 14 శాతాన్ని 27 శాతానికి పెంచింది. ఈ విషయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పిసి శర్మ వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఓబిసిలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.

త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆర్డినెన్సు ఆమోదం కోసం గవర్నర్ ఆనందిబెన్‌కు పంపినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే దీన్ని ఆమోదించాలని కోరారు.

రాష్ట్రంలో ఓబిసిలు బిజెపికి అనుకూలం.. ఎందుకంటే 2005 నుంచి 2018 దీర్ఘ కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహిరించిన శివరాజ్ సింగ్ చౌహన్ ఓబిసి వర్గానికి చెందిన వ్యక్తి.

2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ 50 శాతం కంటే ఎక్కువ ఓబిసి ఓట్లు తమకు పడతాయని బిజెపి భావించింది. అయితే ఫలితాల్లో మాత్రం 230 స్థానాలకు గాను 109 స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ 114 స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 29 లోక్ సభ స్థానాల్లో 26 స్థానాలు బిజెపి ఖాతాలో ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఓబిసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఆదివారం సాయంత్రం విడుదల చేయనుంది.