తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అధిష్టానానికి తలనొప్పిగా మారిన టీ కాంగ్రెస్ వ్యవహారం.. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఎంపి వెంకటరెడ్డి కొత్త డిమాండ్

Share

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కేంద్రంలో, రాష్ట్రంలో సేమ్ టు సేమ్ ఉన్నట్లుగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం వ్యూహాలకు సిద్దం చేస్తుండగా అసమ్మతి నేతలు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాలను సీనియర్ నేతలను గులాం నబీ ఆజాద్, ఆనంద శర్మ లాంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ లో గూడకట్టుకున్న అసమ్మతి మరో సారి బహిర్గతం అయ్యింది. టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి టీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడాన్నే కొందరు సీనియర్ నేతలు బాహాటంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికే పీసీసీ బాధ్యతలు అప్పగించింది.

 

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటున్నారనీ, పార్టీలో సీనియర్ నేతలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి ఇద్దరు ముగ్గురు నేతలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకటరెడ్డి డిమాండ్ నేపథ్యంలో అద్దంకి దయాకర్ తో పాటు రేవంత్ రెడ్డి క్షమాపణ లు చెప్పారు. అయినా వెంకటరెడ్డి శాంతించలేదు. మొన్నటి వరకూ అద్దంకి దయాకర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు చేసిన తాజా డిమాండ్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

telangana congress next target is 79 seats
 

 

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తే పార్టీ చచ్చిపోతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తొలగించాలని, అలాగే పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ ను తప్పించాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. పార్టీ అధిష్టానం ఈ ఇద్దరిని తొలగిస్తేనే తాను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళతానని కోమటిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం జరిగిన ఏఐసీసీ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. నిన్న ఉదయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. ఇదే క్రమంలో తాను ఏఐసీసీ సమావేశానికి ఎందుకు హజరు కాలేకపోతున్నాను అనే అంశాలపై వివరణ ఇస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. తనను పార్టీ ఏలా అవమానిస్తున్నది లేఖలో ప్రస్తావించారు వెంకటరెడ్డి.

 

మాణిక్యం ఠాకూర్ స్థానంలో కమల్ నాథ్ లాంటి సీనియర్ నేతలను తెలంగాణకు ఇన్ చార్జిగా నియమించాలని వెంకటరెడ్డి పార్టీ అధిష్టానానికి సూచించారు. రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాకూర్ లు ఈ పదవుల్లో కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ కోలుకోదని కూడా లేఖలో పేర్కొన్నారు వెంకటరెడ్డి. పార్టీలో అందరి అభిప్రాయాలను తీసుకుని ఇద్దరినీ మారిస్తేనే పార్టీకి విజయావకాశాలు ఉంటాయని వెంకటరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త డిమాండ్ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో పార్టీ అధిష్టానం ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నది ఆసక్తికరంగా మారుతోంది.


Share

Related posts

స్తంభించిన అమెరికా పాలన

Siva Prasad

చంద్రబాబు తిరుపతి టూర్ నేడు

Siva Prasad

అమ్మాయి న‌డిరోడ్డుపై నిల‌బ‌డి..క్షమాప‌ణ చెప్పాలంటున్న ప్ర‌దీప్ అభిమానులు

sridhar