YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి కీలకంగా వ్యవహరిస్తూ నెంబర్ 2 పొజిషన్ వ్యవహారాలు నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు నిత్యం చంద్రబాబు, లోకేష్, టీడీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ట్వీట్ చేసే వారు పలు ట్వీట్ అయితే మరీ దారుణంగా కూడా ఉండేవి. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. 2014 లో పార్టీ ఓడిపోయినా 2019 వరకూ కీలక బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తాన్ని ఆయనే పర్యవేక్షించేవారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నెంబర్ 2 పొజిషన్ లోకి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల నుండి పోటీ రావడంతో పార్టీలో ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి ప్రాభవం, పెత్తనం కొంత తగ్గింది.

ఉత్తరాంధ్ర ఇన్ చార్జి బాధ్యతల నుండి ఆయనను తప్పించి వైవీ సుబ్బారెడ్డిని నియమించిన తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితం అయ్యారు. సోషల్ మీడియా బాధ్యతలను వేరే వాళ్లకు అప్పగించడంతో విజయసాయి రెడ్డి పార్టీలో సైలెంట్ అయ్యారని ప్రచారం జరిగింది. ఆ కారణంగానే ఆయన ట్వీట్ ల లోనూ మార్పు వచ్చింది. ఆయన ట్వీట్ లు కూడా గతంలో మాదిరిగా కాకుండా హుందాతనంగా చేస్తూ వచ్చారు. ఈ పరిణామం చూసి రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ పార్టీలో విజయసాయి రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి సమీప బంధువు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. విజయసాయి రెడ్డి యాక్టివ్ అయ్యారు అని చెప్పడానికి ఇవి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
తాజాగా అనుబంద విభాగాలతో విజయసాయి రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. అంతకు ముందు వివిధ శాఖల ముఖ్య అధికారులతో రివ్యూ నిర్వహించారుట. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాలైన మహిళ, యువజన, విద్యార్ధి విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్ చార్జిలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా సమావేశాలను నిర్వహించిన విజయసాయిరెడ్డి .. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని వారికి పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా వైసీపీ జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను పూర్తి చేయాలని తెలియజేశారు. క్షేత్ర స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. విజయసాయి రెడ్డి యాక్టివ్ అవ్వడంపై ఆయన వర్గీయుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చెత్త సేకరణ ఈ – ఆటోలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్