MP Vijaya Sai Reddy: ఆ నంబర్ 2 ఏమయ్యారు..! ఢిల్లీ పెద్దలతో విజయసాయిరెడ్డి సీక్రెట్ భేటీలు..!!

Share

MP Vijaya Sai Reddy: సాధారణంగా నెంబర్ 2 అంటే గతంలో అంకెలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ మన రాష్ట్రంలో నెంబర్ 2 అంటే గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి విజయసాయి రెడ్డి పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సీఎం జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి రెడ్డి ఏ 2 గా ఉన్నారు. మరో వైపు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాక ముందు వరకూ ఆయనే నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా అన్నీ తానై అయి చక్రం తిప్పారు. 2014 లో పార్టీ ఓడిపోయిన తరువాత వైసీపీకి బ్యాక్ బోన్ గా ఉండి సోషల్ మీడియా వెపన్స్ ను తయారు చేసి మొత్తం అండగా నిలబడిన విజయసాయి రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రమేణ ప్రభావం, ప్రాభవం పార్టీలో తగ్గుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే జగన్మోహనరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆయనను ఇన్ చార్జి గా పెట్టారు, అయితే కొన్ని రాజకీయ మార్పులు దృష్యా, ఆయనపై కొత్తగా వస్తున్న ఆరోపణల దృష్యా, అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వైసీపీ నాయకులకు విజయసాయి రెడ్డితో ఏర్పడిన విభేదాల దృష్యా విజయసాయి రెడ్డి గతం కంటే కొంత స్పీడ్ తగ్గించారు. నిజానికి ఆయనకు ఉన్న స్పీడ్ కు, ఆయనకు ఉన్న తెలివితేటలకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్ లో ఉండాల్సింది. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ చార్జిగా ఇచ్చి ఢిల్లీ వ్యవహారాలు చూసుకోమని నియమించారు. కానీ సొంత పార్టీ నేతలతో విభేదాలు కారణంగా ఉత్తరాంధ్రకు దూరం అవ్వాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఢిల్లీలోనూ జగన్మోహనరెడ్డి అనుకున్నట్లు విజయసాయిరెడ్డి చేయలేకపోవడంతో అదే విధంగా జగన్మోహనరెడ్డి అంచనాలు అందుకోలేకపోవడంతో విజయసాయిరెడ్డిని కాస్త పక్కన పెట్టినట్లుగా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

MP Vijaya Sai Reddy priority Decreased?
MP Vijaya Sai Reddy priority Decreased?

MP Vijaya Sai Reddy: ఢిల్లీలో రహస్య భేటీలు

విజయసాయిరెడ్డిపై ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలు పక్కన బెడితే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోజు ఒకటి లేదా రెండు ట్వీట్ లతో ప్రతిపక్ష టీడీపీని అటు జనసేన పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు బీజేపీపైనా విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టేవారు. ట్విట్టర్ లో నిత్యం ప్రత్యర్థులను రెచ్చగొట్టి మరీ విమర్శలు చేయించుకునేది విజయసాయిరెడ్డి.  అటువంటి విజయసాయి రెడ్డి ట్విట్టర్ ఈ మధ్య బోసిపోయింది. ఆయన మీద పంచ్ లు వేయడానికి జనసేన, టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. ఆయనేమో సైలెంట్ అయిపోయారు. రెండు మూడు రోజులకు ఒక ట్వీట్ తప్ప రెగ్యులర్ గా చేయడం లేదు. ఎక్కడా మీడియాలోనూ కనిపించడం లేదు. అక్కడ ఉత్తరాంధ్రలోనూ కనిపించడం లేదు. సో.. విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నారు అంటే ఢిల్లీలో ఉన్నట్లు సమచారం. ఆయన ఉండాల్సిన విశాఖలో పీకే టీమ్ సర్వే నిర్వహిస్తోంది. వైసీపీ పని తీరు, గ్రేటర్ విశాఖ ఎన్నికల తరువాత అక్కడ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై సర్వే చేయడానికి పీకే టీమ్ మకాం వేసింది. ఉత్తరాంధ్రలో సమన్వయ కార్యక్రమాలు నిర్వహించాల్సిన విజయసాయిరెడ్డి గారేమో ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోనూ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు.

ఢిల్లీలో వ్యవహారాలకు ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్

ఎందుకంటే ఢిల్లీలో ఏపి ప్రభుత్వ వ్యవహారాలను చూసేందుకు జగన్మోహనరెడ్డి తాజాగా మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. ఆయన సీఎస్ గా రిటైర్ అయిన రోజునే ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. దీంతో విజయసాయిరెడ్డి కి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున, పనులు ఏమి లేవు. కాకపోతే ఆయన పార్టీ వ్యవహారాల కారణంగా లోపాయికారీ కొన్ని వ్యవహారాలతో కొంత మంది బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ మధ్యనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. అదే విధంగా ఇంకొంత మంది కేంద్ర మంత్రులతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఇవన్నీ జగన్మోహనరెడ్డికి తెలియకుండా చేస్తున్నట్లు అయితే ఏమీ కాదు. జగన్మోహనరెడ్డి సూచన మేరకే ఏపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా గానీ లేక వైసీపీకి అటు కేంద్రంలోని బీజేపీ మధ్య లోపాయికారీ వ్యవహారాలు అంటే అనధికార పొత్తులో భాగంగా కొన్ని చర్చల కోసం విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉన్నారు. ఢిల్లీలో ఉన్నా ఆయన ట్విట్టర్ లో సైలెంట్ ఎందుకు అయ్యారు. ప్రత్యర్థులపై ఎందుకు పంచ్ లు వేయడం లేదు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే పార్టీ ఆయనను సైలెంట్ చేసింది. ఆయన హవా నెమ్మదిగా తగ్గిస్తుంది అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఉత్తరాంధ్ర కు వేరే ఇన్ చార్జిని నియమించాలని చూస్తున్నారు. ఢిల్లీలో ఏపి వ్యవహారాలను చూసేందుకు ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. దీంతో విజయసాయి రెడ్డికి కాస్త పని తగ్గినట్లే (తగ్గించినట్లే) అని అనుకుంటున్నారు.


Share

Related posts

‘తొలి విడత 1నుండి 6 వరకే ఆంగ్ల మాధ్యమం’

somaraju sharma

అధికారం కోసమే ‘దగ్గుబాటి’పార్టీ మార్పు: చంద్రబాబు

Siva Prasad

హద్దు మీరిన సిద్ధరామయ్య

Siva Prasad