వైసీపీలో ఎమ్మెల్యే X ఎంపీ..!! సంచలనమవుతున్న కాల్ లిస్టు వివాదం..!!

మనిషి జీవితంలో ఈగో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది..! ఓ స్థాయికి వెళ్ళాక ఇది బాగా ముదురుతోంది. అహంకార ధోరణితో వ్యవహరిస్తూ.., ఆత్మాభిమానం అనే పేరు చెప్పుకుంటూ.. ఈగోలు పెంచుకుంటూ… వివాదాలకు దిగుతుంటారు. రాజకీయాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది..! తాజాగా గుంటూరు జిల్లాలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య మొదలైన “ఈగో” వివాదం చాలా పెద్దస్థాయికి వెళ్ళింది. పార్టీలో కీలక నేతలు, పోలీసులు సైతం దీనిలో ఇరుక్కుపోతుండడం సంచలనం కలిగిస్తుంది…!!

ఇద్దరూ తొలిసారిగానే గెలిచారు.. అయినా..!!?

నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడతల రజని..! ఇద్దరూ తొలిసారిగా గెలిచారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల్లో మంచి బాసట వేసుకోవడం మానుకుని, హోదా, దర్పం అనుభవిస్తూ.. తరచూ వివాదాలకు దిగుతున్నారు. నిజానికి ఈ ఇద్దరి మధ్య 2019 ఎన్నికల నాటి నుండి సైలెంట్ వార్ నడుస్తుంది. ఇప్పుడు మరింత రచ్చకెళ్తున్నాయి.


చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడదల రజనికి అనుకూల వర్గం ఎంతగా ఉందో.., ఆమె ప్రవర్తన, అతి కారణంగా వ్యతిరేకవర్గం అదే స్థాయిలో ఉంది. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలుకి ఇదే అదనుగా దొరికి.., ఆమె వ్యతిరేక వర్గానికి బాసటగా నిలుస్తున్నారనేది ఒక టాక్. ఒకానొక సందర్భంలో రజని అయితే “తన అనుమతి లేకుండా తన నియోజకవర్గంలో ఎంపీ అడుగు పెట్టడానికి వీలులేదని” బహిరంగంగా అన్నారు. అనంతరం వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో ఆ ఎంపీని తన వర్గీయులతో రజని అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది..! ఇక్కడితో అయిపోలేదు..!!

కాల్ లిస్టు వ్యవహారం దశలు తిరుగుతుంది..!!

ఇక ఈ ఇద్దరి మధ్య తాజా వ్యవహారం మాత్రం శృతి మించింది. పార్టీ పెద్దలకు కూడా చెమటలు పట్టిస్తుంది. ఫోన్ కాల్ లిస్ట్ వ్యవహారం కొద్దిరోజులుగా కలకలం రేపుతోంది. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు జిల్లాలోని ఓ డిఎస్పీ ద్వారా ఎమ్మెల్యే పీఏ ఫోన్ కాల్ డేటా సేకరించారనేది ఓ పెద్ద ఆరోపణ. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు, పార్టీ పెద్దలకు కూడా పిర్యాదు చేసారు. దీనిపై అంతర్గతంగా విచారణ జరిపిన పోలీసులు ఓ డీఎస్పీని, సీఐని వీఆర్ కి పంపించారు.

* దీనిలో కొన్ని ట్విస్టులున్నాయి. పార్టీ అంతర్గత చర్చల ప్రకారం చుస్తే ఇద్దరి వాదనలు వేర్వేరుగా ఉంటున్నాయి..! ఎమ్మెల్యే రజని పీఏ.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న మహిళకు తరచూ కాల్ చేసి వేధిస్తున్న కారణంగానే కాల్ డేటా సేకరించినట్టు ఓ వర్గం చెబుతుండగా.., ఎమ్మెల్యే రజని అవినీతిని బహిర్గతం చేయడానికి.., ఈ కాల్ లిస్టు ఆధారంగా పీఏ ద్వారా కీలక సమాచారం రాబట్టడానికి ఎంపీ ఇలా చేసినట్టు మరో వర్గం చెబుతుంది.

విషయం ఓ పెద్ద వరకు వెళ్లగా..!?

విషయం కాల్ లిస్టు వరకు వెళ్ళింది అంటే మరి అక్కడితో ఆగదుగా..! ఎమ్మెల్యే రజని ఈ వ్యవహారంపై తన రాజకీయ గురువు (జగన్ తర్వాత పార్టీలో కీలక స్థానంలో ఉన్న అయిదుగురిలో ఒకరు)కి పిర్యాదు చేయగా.., ఆయన మరింత అతిగా స్పందించారు. పార్టీ నియమావళికి భిన్నంగా వ్యవహరించి తన పవర్ చూపించారు. రజని చెప్పిన మాటకు మాత్రమే విలువనిచ్చి, ఎదుటి వారి వివరణ కూడా తీసుకోకుండా… ఉన్నతాధికారులకు చెప్పి సదరు డీఎస్పీని, సీఐని వీఆర్ కి పంపించారు. ఇక ఈ విషయంతో ఖంగుతిన్న ఎంపీ శ్రీకృష్ణదేవరయాలు నేరుగా సీఎం జగన్ కి విషయం మొత్తం చెప్పారు. ఆయన కల్పించుకోవడంతో ఆ పోలీసులపై చర్యలు ఆగాయి. ఈ వివాదం ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా అంతర్గతంగా రగులుతుంది. ఈ వ్యవహారం గుంటూరు జిల్లాలోనూ, వైసీపీలోనూ తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే రజని రాజకీయ గురువు ఇలా ఏకపక్షంగా వ్యవహరించడమూ ఓ విషయమే కదా..!! అందుకే ఆయన చుట్టూ కూడా ఈ విషయం బిగిసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.