కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రస్తుతం చాలా మంది భిన్న రకాల మాస్క్‌లను ధరిస్తున్నారు. అయితే వస్త్రంతో తయారు చేసే మాస్కులు కూడా కోవిడ్ రాకుండా సమర్థవంతంగా పనిచేస్తాయని సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ఈ మేరకు తాజాగా ఓ అధ్యయనాన్ని చేపట్టింది.
వాల్వ్ లేని, మల్టీ లేయర్ క్లాత్ మాస్క్‌లను ధరించడం వల్ల కోవిడ్ వ్యాప్తి 80 శాతం వరకు తగ్గుతుందని సీడీసీ సైంటిస్టులు గుర్తించారు. ఇందుకు గాను వారు ప్రయోగాలను కూడా చేపట్టారు. మల్టీ లేయర్ క్లాత్ మాస్క్‌ల ద్వారా కేవలం పెద్ద తుంపర్లే కాకుండా 10 మైక్రాన్ల కన్నా చిన్న సైజ్‌లో ఉండే తుంపర్లు కూడా బ్లాక్ అవుతాయని, కరోనా వచ్చిన వారి నుంచి ఆ తుంపర్లు బయటకు వెలువడకుండా ఉంటాయని, అలాగే ఆ తరహా మాస్క్‌లను ధరించే వారికి కరోనా నుంచి రక్షణ లభిస్తుందని సైంటిస్టులు తేల్చారు.
అయితే కరోనాను నివారించేందుకు క్లాత్ మాస్క్‌లను వాడినప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ధరిస్తేనే ప్రభావవంతంగా పనిచేస్తాయన్నారు. కరోనా రాకుండా ఉండేందుకు ఎన్ 95 మాస్క్‌లను, ఇతర పకడ్బందీ మాస్క్‌లను ధరించాల్సిన పనిలేదని, మల్టీ లేయర్ క్లాత్‌తో తయారు చేసిన మాస్క్‌ల వల్ల కూడా కరోనా నుంచి ఎక్కువ రక్షణ లభిస్తుందని చెప్పారు. ఎక్కువ పొరలతో మాస్క్‌లు ఉంటే వాటి గుండా కరోనా వైరస్ లోపలికి ప్రవేశించలేదని తెలిపారు. అందువల్ల నిర్భయంగా మల్టీ లేయర్ క్లాత్ మాస్క్‌లను ధరించవచ్చని తెలిపారు.