ముంబై డ్యాన్స్ బార్లకు ఊరట

ఢిల్లీ, జనవరి 17: మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లపై ఉన్న ఆంక్షలను అత్యున్నత న్యాయస్ధానం సడలించింది.
డాన్స్ బార్లపై నిషేధం విధించడం సాధ్యం కాకపోవడంతో, లైసెన్స్‌ల జారీకి సవాలక్ష ఆంక్షలను విధిస్తూ మహరాష్ట్ర 2016లో మహిళ ఆత్మ గౌరవం పేరిట ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దాని ప్రకారం ప్రభుత్వం విధించిన ఆంక్షలను తొలగించాలని కోరుతూ హోటళ్ళు, రెస్టారెంట్ల యజమానులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వం విధించిన ఆంక్షలను తప్పుపట్టింది.
సాయంత్రం ఆరు నుంచి రాత్రి 11.30గంటల వరకే డాన్స్ బార్లను తెరచి ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. డాన్స్ బార్లలో మద్యం సేవించేందుకు కూడా సుప్రీం కోర్టు అనుమతించింది. నృత్యం చేసేవారి పైన డబ్బులు విసరడాన్ని అంగీకరించలేదు. బార్లలో సిసిటివి కెమేరాలు ఉంచాలన్న ఆంక్షను రద్దు చేసింది.
ప్రార్ధనా మందిరాలకు, విద్యా సంస్థలకూ కిలో మీటర్ దూరంలో డ్యాన్స్ బార్ల ఏర్పాటు చేయాలన్న ఆంక్షను కోర్టు రద్దు చేసింది. ముంబైలాంటి నగరాల్లో ఇటువంటి నిబంధనలు సాధ్యపడవని తెలిపింది. ఢ్యాన్సర్లకు బార్ ఓనర్లకు మధ్య తప్పకుండా కాంట్రాక్టు ఉండాలని పేర్కొన్నది.