యుఎస్ మద్దతు కోసం ముషరాఫ్ యత్నం


వాషింగ్టన్, డిసెంబరు29: మళ్ళీ అధికారంలోకి చేపట్టాలి. అందుకు యుఎస్ మద్దతు కావాలి అంటూ పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషరాఫ్ మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ దేశంలోనే తలదాచుకున్న ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ తెలుసుకోలేక పోయినందుకు తనకు సిగ్గుగా ఉందని కూడా ఆయన అన్నారు. ఈ వీడియోలు బయటకు రావడం ముషరాఫ్‌కు ఇబ్బందేనని చెప్పాలి.
ముషరాఫ్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతున్న వీడియోను ప్రముఖ పాకిస్తానీ కాలమిస్ట్ గుల్ బుఖారీ ట్విటర్లో పోస్టు చేశారు. సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకున్న 75 ఏళ్ళ ముషరాఫ్ 2001 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పలు కేసుల్లో ముషరాఫ్ నిందితునిగా వున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు ఆయనపై మోపిన దేశద్రోహం అభియోగం కూడా విచారణలో ఉంది. 2016 మార్చిలో దుబాయికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లి తిరిగి పాకిస్తాన్‌కు రాలేదు. ఒక వీడియో క్లిప్పింగ్‌లో అమెరికా కాంగ్రెస్ సభ్యులతో కలసి నడుస్తున్నట్లు వుంది, మరొక వీడియోలో అమెరికన్ యూదు కాంగ్రెస్ ఛైర్మన్ జాక్ రాసెన్‌తో ముచ్చటిస్తున్నట్లుంది. ఉగ్రవాదం, ఐసిస్, లాడెన్, 9/11 వంటి సంఘటనల గురించి ముషరాఫ్  ఈ వీడియోలలో అమెరికన్ చట్ట సభ సభ్యులతో చర్చించారు.

వీడియో కోసం కింద క్లిక్ చేయండి.