కింగ్ అక్కినేని నాగార్జున లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ను డేరింగ్ గా మొదలుపెట్టిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరు. వైల్డ్ డాగ్ చిత్రాన్ని చేస్తున్నాడు నాగ్. ఈ సినిమా షూటింగ్ తో పాటు, బిగ్ బాస్ షూటింగ్ ను కూడా మొదలుపెట్టాడు. సీజన్ 3 ను విజయవంతంగా హోస్ట్ చేసిన నాగ్, సీజన్ 4 ను కూడా హోస్ట్ చేస్తున్నాడు.
ఇక ఇవన్నీ కాకుండా నాగార్జున ఇప్పుడు మరో రిస్క్ కు సిద్ధమయ్యాడు. ప్లాపుల్లో ఉన్న ఒక యువ హీరోతో, ప్లాపుల్లో ఉన్న ఒక యువ దర్శకుడితో సినిమాను పట్టాలెక్కించాడు. ఈ కాంబినేషన్ వివరాల్లోకి వెళితే… ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ముందుగా ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంపికైన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరో అయిపోయాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఆ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అక్కినేని నాగార్జున ప్రెజంట్ చేసాడు. ఇండస్ట్రీకి మంచి టాలెంట్ ఇంట్రడ్యూస్ చేసినందుకు నాగ్ కూడా చాలా హ్యాపీ. రాజ్ తరుణ్ తర్వాత కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్తా మావ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుని ప్రామిసింగ్ యువ హీరో అనిపించుకున్నాడు. అయితే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన రాజ్ తరుణ్, సక్సెస్ లను నిలుపుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు.
గత రెండు, మూడేళ్ళలో రాజ్ తరుణ్ నుండి ఎన్నో ప్లాపులొచ్చాయి. విజయవంతమైన చిత్రాలను అందించే దిల్ రాజు కూడా రాజ్ తరుణ్ కు హిట్ అందివ్వలేక రెండు సార్లు చతికిలపడ్డాడు. లవర్ సినిమాతో దారుణమైన ప్లాప్ ను అందుకున్న దిల్ రాజు, మరోసారి రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే తీసి మరో ప్లాప్ ను అందుకున్నాడు. రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా ఇప్పుడు ఓటిటిలో విడుదలవుతోంది. అలాగే రాజ్ తరుణ్ నెక్స్ట్ సినిమా లాంచ్ అయింది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ లో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.