నంద్యాల కేసులో కీలక పరిణామం..నిందితుల బెయిల్ రద్దు చేసిన కోర్టు

 

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల బెయిల్ ను రద్దు చేస్తూ నంద్యాల కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులపై 306 సెక్షన్ నమోదు చేయాలనీ, నిందితులు డిసెంబర్ 2వ తేదీలోగా నంద్యాల కోర్టుకు హజరుకావాలనీ ఆదేశించింది.

 

నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం ఈ నెల 3వ తేదీన భార్య, తన ఇద్దరు పిల్లలతో గూడ్స్ రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత వారు ఆత్మహత్య చేసుకోక ముందు తీసిన సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో వీరి ఆత్మహత్యకు పోలీసులే కారణమని తెలిసింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. దీంతో నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందించారు. ఘటనపై విచారణకు ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియమిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.

ఘటనకు బాధ్యులుగా సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లను సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు. అయితే వీరిని అరెస్టు చేసిన 24 గంటల్లో బెయిల్ పై విడుదల కావడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో పోలీస్ అధికారులు నంద్యాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం నంద్యాల కోర్టులో దీనిపై విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. నిందితులపై బెయిల్ రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.