కేటిఆర్‌కు లోకేష్ కౌంటర్

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కామెంట్స్‌కు ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.

శనివారం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని ఎద్దేవా చేశారు. నూరు శాతం చంద్రబాబు పార్టీ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై లోకేష్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

తెలుగుదేశం ఓటమి కోసం కృషి చేసే కేసిఆర్ ఆయన సహచరులకు భంగపాటు తప్పదని లోకేష్ ట్వీట్ చేశారు. ఇది తథ్యం అని జోస్యం చెప్పారు. ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం లో పోటీ పడలేక, జగన్ తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో టిఆర్ఎస్ ముందుకొస్తున్న విషయం ఇవ్వాళ కేటిఆర్ మాటల్లో తేలిపోయిందని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ మోది, తెలంగాణ మోది కేసిఆర్, ఆంధ్రా మోది జగన్ కి  కలలో కూడా చంద్రబాబే గుర్తుకొస్తున్నారు అన్న విషయం ఈ రోజు కేటిఆర్ మాటల్లో బయటపడిందని లోకేష్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసిఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు అని ఎద్దేవా చేశారు.