జగన్ – మోది కుల రాజకీయం – లోకేష్

ఏపీలో అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. పోలీసు పదోన్నతలు మొదలు, రైతు కోటయ్య మృతి, తాజాగా చింతమనేని విషయం వరకూ వైకాపా.. తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో వైకాపా చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ – మోది ద్వయం కుల రాజకీయాలు చేస్తోందంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కులాల పేరుతో ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. అబద్ధం – నిజం అంటూ వరుస ట్వీట్లు చేశారు.

జగన్ – మోది కుల రాజకీయం: ‘ ఏపీ పోలీస్ శాఖలో 37 మందికి డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ, 35 మంది కమ్మ వారిని ముఖ్యమంత్రి తీసుకున్నారని ఢిల్లీలో జగన్ ఆరోపించారు. నిజమేంటంటే… 2018 వరకు ప్రమోషన్ ప్యానెల్ లో ఉండి ప్రస్తుతం సూపర్ న్యూమరీ పోస్టుల్లో కొనసాగుతున్న 35 మందిలో బీసీలు 9మంది, రెడ్లు ఏడుగురు, ఎస్సీలు ఏడుగురు, బలిజ/కాపు వర్గీయులు నలుగురు, ముస్లిం మైనారిటీలు ఇద్దరు, కమ్మ వర్గీయులు ఇద్దరు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీలు ఒక్కొక్కరు ఉన్నారు.’

జగన్ – మోది కుల రాజకీయం: ‘ కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై ట్వీట్ చేస్తూ, కోటయ్యను ఒక బీసీ(ముత్రాసి) రైతు అని నొక్కి చెప్పారు జగన్. మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం జగన్ కే చెల్లింది. నిజమేంటంటే.. కొట్టి కొనఊపిరితో ఉన్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారని ట్వీట్ చేస్తూ మీరే చంపేశారని చంద్రబాబుగారి మీద, పోలీసుల మీద నింద వేసిన జగన్.. ఈ ఫొటోలో రైతు ప్రాణం కాపాడేందుకు భుజాల మీద తీసుకెళ్తున్న పోలీసులు ఎవరు? మోది పంపారా?.’

జగన్ – మోది కుల రాజకీయం: ‘ చింతమనేని ప్రసంగాన్ని కావలసినంత వరకే ఎడిట్ చేసి దళితులను అవమానించారంటూ జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారు. నిజమేంటంటే..చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు? వీడియోలో చింతమనేని మాటలకు వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా జగన్ గారు?.’

‘పదే పదే కుల ప్రస్తావన తెస్తూ, కులాల చిచ్చుతో ఏపీని అస్థిరపరచాలని చూస్తున్న జగన్ వెనుక, రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని కేసీఆర్, మోదీల పాత్ర స్పష్టమవుతోంది. తెదేపాను దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వం. ప్రజలకు మీ కుట్రలు అర్థమైన నాడు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.’ అని వరుస ట్వీట్లు చేశారు.