నాయిని ఇంట మరో విషాదం..భార్య అహల్య కన్నుమూత

 

(హైదరాబాద్‌ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

టీఆర్ఎస్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్శింహరెడ్డి నివాసంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి అహల్య (68) నేడు కన్నుమూశారు.

గత నెలలో నాయని నర్శింహరెడ్డితో పాటు ఆమెకు కరోనా సోకింది. అయితే చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ చేరుకోవడంతో జూబ్లీహిల్స్ అపొలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. ఈ నెల 22వ తేదీన నాయిని నర్శింహరెడ్డి కన్ను మూసిన రోజున చివరి చూపు కోసం ఆమెను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. వీల్ చెయిర్ నుండే ఆమె భర్త భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. నాయిని మృతి నుండి కుటుంబ సభ్యులు కోలుకోకముందే మరో విషాదం చోటుచేసుకోవడం వారిని మరింత కృంగదీసింది. భర్త చనిపోయిన నాల్గవ రోజు ఆమె కూడా కన్నుమూయడం పట్ల పలువురు బాధను వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు, సన్నిహితులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.