త‌న సుదీర్ఘ ప్ర‌త్య‌ర్థిని ఆడుకునే గేమ్ మొద‌లుపెట్టిన బాబు?

మాజీ జడ్జీ రామకృష్ణ  సోదరుడు రామచంద్రపై దాడి జ‌రిగిన ఉదంతం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి త‌రుణంలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న సుదీర్ఘ ప్ర‌త్య‌ర్థిని ఆడుకునే గేమ్ మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. ఆయ‌నే మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.

టీడీపీ కీల‌క ఆరోప‌ణ‌లు

టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఇంతపెద్దఎత్తున దళితులపై దాడులు జరుగుతున్నా, ఈ ప్రభుత్వం ఎందుకు కిమ్మనడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. మాజీ జడ్జీ రామకృష్ణ  సోదరుడు రామచంద్రపై దాడి జరిగితే, తెలుగుదేశం వారే చేశారంటూ పోలీస్ వారు చెప్పడం సరికాదని అన్నారు. తెలుగుదేశం పార్టీవారికి రామచంద్రపై దాడిచేయాల్సిన అవసరం ఏమిటని రామయ్య ప్రశ్నించారు. దళితులపై రాష్ట్రప్రభుత్వం సాగిస్తున్న దారుణాలపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని, అది జరిగిన మరునాడే, రామకృష్ణ సోదరుడిపై హత్యాయత్నం జరిగిందన్నారు.

పెద్దిరెడ్డిని పోలీస్ స్టేష‌న్‌కు పిలుస్తారా?

రామకృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలంటే, అక్కడ జరిగిన వాస్తవాలు రాష్ట్రానికి తెలియాలంటే, స్థానిక పోలీస్ యంత్రాంగం మారాలని వ‌ర్ల రామ‌య్య అన్నారు. స్థానిక మంత్రికి జీ.. హుజూర్ అనడం తప్ప, అక్కడున్న పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని ఆరోపించారు. రామకృష్ణ సోదరుడిపై టీడీపీవారే దాడిచేశారని చిత్తూరు ఎస్పీ చెబుతున్నాడని, దానికి ఆయనదగ్గరున్న ఆధారాలేమిటో బయటపెట్టాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. రామచంద్రపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బైండోవర్ చేసి, ఆయన్ని స్టేషన్ కు పిలిపించి విచారణ చేయాలని వర్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పెద్దిరెడ్డితో బాబు పంచాయ‌తీ ఇప్ప‌టిది కాదు

చిత్త‌రు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 14 స్థానాలలో చంద్ర‌బాబు పోటీ చేసిన‌ కుప్పం మినహా అన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. పెద్దిరెడ్డి మంత్రి అయ్యారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు ఓ రేంజ్‌లో వ్య‌తిరేక‌త ఉందంటున్నారు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయంటున్నారు. నలభై ఏళ్లుగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ వైరం ఉందట‌. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో చదువుకొనే రోజుల నుంచి వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ప‌రిస్థితి ఉందని చిత్తూరు జిల్లాకు చెందిన రాజ‌కీయ నాయ‌కులు పేర్కొంటున్నారు. గ‌త కొద్దికాలం నుంచి పాత వైరం మళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చిందంటున్నారు. అప్పటి నుంచి కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా దెబ్బతీయాని పెద్దిరెడ్డి స్కెచ్చులు వేస్తున్నారు.

ఇటు బాబు అటు పెద్దిరెడ్డి

త‌న టార్గెట్‌గా పెద్దిరెడ్డి ముందుకు సాగుతుండ‌టంతో చంద్ర‌బాబు సైతం విరుచుకుప‌డుతున్నారు.
మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తుంటే.. పుంగనూరు పెద్దిరెడ్డి అడ్డాగా ఉంది. ప్రస్తుతం ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు తలదూర్చడం మొద‌లైంది. పుంగనూరులో అక్రమాలు జరుగుతున్నాయని.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో పెద్దిరెడ్డి బెదిరించి ఏకగ్రీవాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పంపై ఫోకస్‌ పెంచిన మంత్రి పెద్దిరెడ్డి మంత్రాంగంతో తెలుగుదేశం పార్టీ నుంచి గడిచిన రెండు నెలలుగా కుప్పంలో టీడీపీ నుంచి వైసీపీలోకి రాజకీయ వలసలు బాగా పెరిగాయి. దీంతో ఇటు చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డిలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ద‌ళితుల‌పై దాడిఅంశం తెర‌మీద‌కు తెచ్చార‌ని, ఏకంగా స్టేష‌న్‌కు పిల‌వాల‌ని అంటున్నార‌ని చెప్తున్నారు.