తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పోరు..! ఆర్టీసీ పాపం ఎవరిదీ..!?

దసరా అంటే తెలంగాణాలో బతుకమ్మలు.., ఏపీలో నవరాత్రి ఉత్సవాలు.. ఉద్యోగులకు సెలవులు.., రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు.., బస్టాండులో సందళ్ళు.., రోడ్డుపై ప్రయాణ హడావిడీలు..!! దసరా వస్తే చాలు.., హైదరాబాద్ నుండి వేలాది బస్సుల్లో లక్షలాది జనం సొంత ఊళ్ళకి వస్తుంటారు. రెట్టింపు చార్జీలు ఉన్నా పట్టించుకోకుండా రాకపోకలు చేస్తారు. ఇటువంటి సందర్భం ఈ ఏడాదిలో ఆర్టీసీ వాడుకోలేదు. సరే ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల మధ్య బస్సుల వివాదం వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు ఆగిపోయాయి.

ఇదీ ప్రస్తుత పరిస్థితి..!!

ఏపీ నుండి హైదరాబాద్ పోవాలన్నా, ఆడకెళ్లి ఆంధ్రా రావాలన్నా ఇది వరకు ఇద్దరు డ్రైవర్లు మారేవారు. కానీ ఇప్పుడు ప్రయాణికులే రెండు బస్సులు మారుతున్నారు.


* తిరుపతి, కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో ఆర్టీసీ బస్సుల్లో కర్నూలులో డ్రైవర్ మారేవారు. రాత్రిపూట కంటిన్యూగా నడపటం కష్టం కనుక అలా ఒక బస్సు కి ఇద్దరు డ్రైవర్లు మారటం పాత పద్దతి..ఇప్పుడు ప్రయాణికులు ఆ సరిహద్దు దగ్గర దిగిపోయి.., రాష్ట్రాలు మారి.., బస్సులు వేరేవి ఎక్కాల్సిన పరిస్థితి. నడిరేయి అయినా, లగేజీ, కుటుంబం, పిల్లాపాపపల్తో ఇలా మారాల్సిందే. తెలంగాణ, తమిళనాడు సరిహద్దుల దాకా ఒక బస్సులో ప్రయాణం ఆంధ్ర సరిహద్దులో అడుగుపెట్టాక మరో బస్సులో ప్రయాణం చేయాల్సిందే. దీనికి అదనపు శ్రమ, అదనపు ఖర్చు..!! మరి ఏపీ పెద్దలు, తెలంగాణ పెద్దలు “ఇద్దరం కలిసి హోదా తెస్తాం, విభజన హామీలు నెరవేరుస్తాం, నీళ్లు పంచుకుంటాం” అని చెప్పి ఇప్పుడు కనీసం బస్సులు నడపలేకపోవటం మాత్రం విడ్డూరమే..!!

ఎవరు కారణం.. ఎవరిదీ పాపం..!?

దీనికి కారణం..? పాపం ఎవరు అనేది తేల్చుకునే ముందు..! సింపుల్ గా కొన్ని అంశాలు చెప్పుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉన్న హైదరాబాద్ ని.., రెండేళ్లలోనే వదిలేసి వచ్చేసింది ఎవరు..? జలాలు, విద్యుత్, ఆర్టీసీ విషయంలో పేచీలు పూర్తిగా తీరకమునుపే రాజధానిని వదిలేసి వచ్చేసింది ఎవరు..!? ఉన్నట్టుండి.., ఆకస్మికంగా హైదరాబాద్ ని వదిలేయడం వెనుక మర్మం ఏమిటి..!? ఇది ఆలోచిస్తే కొన్ని పాపాలు, కొన్ని సమాధానాలు దొరికినట్టే..!!

* 2015 జూన్ లో ఓటుకి నోటు కేసు తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నీడపై కూడా నిఘా పెట్టి, వెంటాడింది. దీంతో ఈ పాపాన్ని కడిగేసుకునే క్రమంలో హైదరాబాద్ నుండి బాబు బ్యాచ్ వచ్చేసారు. ఉమ్మడి హక్కులను వాడుకోలేదు. అక్కడితో కేసీఆర్ కి పైచేయి వచ్చేసింది.
* ఆ ఐదేళ్లలో ఈ ఉమ్మడి ఆస్తులపై, పంపకాలపై, ఈ ప్రయాణాలపై పెద్దగా చర్చలు లేవు. పరిష్కారాలు లేవు. కేవలం కారాలు, మిరియాలు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ లో ఆస్తులను కాపాడుకునే ఉద్దేశం.., వ్యాపారాలు భద్రంగా చూసుకునే ఉద్దేశంతో టీడీపీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ తో కయ్యం ఎందుకులే అనుకుని హైదరాబాద్ ని ఉమ్మడిగా చూడడం మానేశారు.

ap cm ys jagan and telangana cm kcr routs are different in national politics
ap cm ys jagan and telangana cm kcr routs are different in national politics

జగన్ అంటీముట్టనట్టుగానే..!!

ఇక జగన్ వంతు వచ్చింది. 2019 లో అధికారంలోకి రావడంలో కేసీఆర్ ఎంతో కొంత సాయం అందించారు. పాలనలో కూడా తోడుంటానని మాటిచ్చారు. అటువంటి కేసీఆర్ ని కూడా జగన్ ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. జల, ఆర్టీసీ వివాదాలు పెరుగుతున్నాయి. తనతో సయోధ్యగా ఉండే కేసీఆర్ తో ఈ సమస్యలపై చర్చించి, ఓ పరిష్కారం చూపడంలో జగన్ కూడా విఫలమవుతున్నారు. జల వివాదాలు అంటే పెద్దవి.. ఈ చేతుల్లో లేదు. కానీ ఆర్టీసీ విషయంలో మాత్రం చొరవ తీసుకోవడం లేదు. ఇద్దరూ మాట్లాడితో పరిష్కారం అయ్యే సమస్యను జనాలపైకి రుద్ది, చోద్యం చూస్తున్నారు..!!