అంచనాలు తలకిందులు చేస్తూ, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తూ వస్తోంది. అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి కూడా వచ్చింది. కానీ, 20 వ రౌండ్ నుంచి ఫలితం మారిపోయింది.
20, 21, 22, 23 మిగతా రౌండ్ లలో బీజేపీ లీడింగ్ సాధించడంతో విజయం సాధించింది. ముందుగా చెప్పినట్టుగానే బీజేపీ దుబ్బాకలో ఘన విజయం సాధించింది. దుబ్బాకలో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలోనే ఆ పార్టీ నేతలు కీలక ప్రకటన చేశారు.
దుబ్బాకలో దుమ్ము రేపడంతో
దుబ్బాకలో గెలుపొందడానికి టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ఎత్తులు వేసింది. అయినప్పటికీ బీజేపీ విజయంపై పలువురు అంచనాలు వేశారు. ఫలితాల సమయంలో ఈ జోరు స్పష్టంగా కనిపించింది. దుబ్బాకలో గెలుపు తర్వాత ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తమ వ్యూహం ఏంటో చెప్పకనే చెప్పేశారు.
2024లో బీజేపీ టార్గెట్ ఇదే
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి విజయాన్ని ఆంధ్రప్రదేశ్ శాఖ స్వాగతిస్తుందన్నారు. విజయం సాధించిన రఘునందన్ రావు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వచ్చిన సార్వత్రిక మరియు ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్లో తెలుగు రాష్ట్రాలలో పార్టీ గెలుపుకున నాంది అని పేర్కొన్నారు. 2024లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీదే అధికారం అని వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. మోదీ అవలంభిస్తోన్న ప్రజా ఆమోద పథకాల అమలు దేశానికే గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు.
తిరుపతో బీజేపీ ఏం చేయబోతోందంటే…
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్,విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి తిరిగి పట్టం కట్టి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో ఉప ఎన్నికల్లో గెలవడం బీజేపీకి మరింత ఊతమిస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రజల ముందుకు వస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు ప్రజావ్యతిరేక విధానాలకు తిరుపతి ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చి వైసీపీకి బుద్ధి బీజేపీ చెబుతారు అని జోస్యం చెప్పారు.