కాళేశ్వరంలో అతిక్రమలు జరిగాయి..ఎన్జీటీ

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) పేర్కొన్నది.  తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ మంగళవారం తీర్పు వెలువరించింది. పర్యావరణ అనుమతుల్లో అతిక్రమలు జరిగినట్లు గుర్తించామని ఎన్జీటీ పేర్కొన్నది.

 

విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నప్పటికీ పర్యావరణాన్ని విస్మరించలేమని పేర్కొంటూ..ప్రాజెక్టు పూర్తి అయినందున ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి అవసరాలకు కూడా రూపకల్పన చేశారనీ, వీటిని పరిగణలోకి తీసుకోవడంలో కేంద్ర పర్యావరణ శాఖ విఫలమైందని ఎన్జీటీ పేర్కొన్నది. పర్యావరణ ప్రభావ ముదింపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని పేర్కొన్న ఎన్జీటీ పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు అవసరమని తెలియజేసింది. 2008 -2017 వరకూ జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావస అంశాలను అధ్యయనం చేయాలని ఎన్జీటీ ఆదేశించింది.