విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి

జవహర్ నవోదయ విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. 2013 నుంచి 2017 మధ్య కాలంలో జవహర్ నవోదయ విద్యాలయాల్లో 49 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దారుణమైన విషయమని పేర్కొంది. ఈ ఆత్మహత్యలపై సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

నవోదయ విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు, కథనాలపై సుమోటోగా తీసుకుని కేంద్రానికి, మానవవనరుల అభివృద్ధి శాఖకు ఈ రోజు నోటీసులు పంపింది. 2013-17 మధ్య కాలంలో నవోదయ విద్యార్థుల ఆత్మహత్యలలో ఎక్కువ భాగం బాలురు కాగా వారిలో కూడా దళితులు, గిరిజనుల సంఖ్యే ఎక్కువగా ఉంది. గ్రామీణ విద్యార్థులను ప్రతిభామంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నెలకొల్పిన జవహర్ విద్యాలయాల్లోనే ఆత్మహత్య సంఘటనలు జరగడం అత్యంత విషాదకరమైన విషయమని మానవహక్కుల కమిషన్ అభిప్రాయపడింది.