వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి బదలాయింపు

అమరావతి, జనవరి 4: విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో  ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్‍‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)కి బదలాయించారు.  ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించి. వైసీపీ నాయకులు కోరుతున్నట్టుగా కేసు విచారణను జాతీయ సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ 26న శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.

 

 ఈ కేసులో  శ్రీనివాసరావు మాత్రమే నిందితుడని, వెనుక మరెవరూ లేరని ఏపీ పోలీసు అధికారి లడ్డా వెల్లడించిన రెండు రోజుల్లోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున విచారణను జాతీయ సంస్థకు అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
 ఈ కేసును విమానయాన చట్టాల ప్రకారం రిజిస్టర్ చేసి, సెక్షన్ 3 (ఏ) కింద నమోదు చేయాలన్న వారి అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది.