భారత్ లో అత్యాచార ఆరోపణలతో కేసులు నమోదు కాగా విదేశాలకు పారిపోయిన స్వామి నిత్యానంద మరో సారి వార్తల్లో నిలిచారు. భారత్ దేశం నుండి పరారైన తర్వాత నిత్యానంద తానొక దేశాన్ని ఏర్పాటు చేశాననీ, తన దేశానికి కైలాస అని పెట్టాననీ, తన దేశానికి జెండా ఉందనీ, రిజర్వ్ బ్యాంకు, సొంత కరెన్సీ ఉన్నట్లుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో అప్పట్లో అందరూ నవ్వుకున్నారు. ఇదో రకమైన ప్రచారమని తేలిగ్గా తీసుకున్నారు.

అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే కైలస దేశం ఉత్తుత్తి దేశం కాదనీ, నిత్యానంద నిజంగానే ఆ దేశానికి అధినేత అని రుజువు చేసే సాక్షం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ దేశం తరుపున ఇద్దరు ప్రతినిధులు ఐక్య రాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్నారు. తనకు తాను విజయ ప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్న ఆ మహిళా ప్రతినిధి భారత్ పై ఆరోపణలు చేశారు. నిత్యానంద ను భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తొందని వ్యాఖ్యానించారు. జెనీవాలో జరిగిన ఆర్దిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (ఈఈఎస్‌సీఆర్) సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందువుల కోసం ఏర్పాటైన తొలి సార్వభౌమ దేశం కైలాస అని, హిందూమతానికి చెందిన అత్యున్నత గురువు నిత్యానంద పరమశివం దీన్ని నెలకొల్పారని ఆ దేశ మహిళా ప్రతినిధి విజయప్రియ పేర్కొన్నారు. హిందూ సంప్రదాయాలను, హిందూ నాగరికతను ఆయన పునరుద్దరిస్తున్నారనీ, ఆది శైవులు అనే వ్యవసాయ తెగలకూ ఆయన పునరుజ్జీవం పోస్తున్నారని తెలిపారు. అది శైవ తెగకు ఆయనే అధినేత అని చెప్పుకొచ్చారు. అనంతరం కైలాస నుండే వచ్చిన మరో ప్రతినిది ఈఎస్ కుమార్ సైతం సమావేశంలో మాట్లాడారు.
నిత్యానంద పై భారత్ లో అనేక కేసులు ఉన్నాయి. అత్యాచారం, అపహరణ వంటి కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులకు సంబంధించి గుజరాత్ లో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ అయ్యింది. 2019 లో నిత్యానంద దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత తిరిగి భారత్ కు రాలేదు. అయితే 2020లో తాను ఓ దేశాన్ని (కైలాస) ను ఏర్పాటు చేసినట్లుగా సంచలన ప్రకటన చేశారు నిత్యానంద.