తరుముకొస్తున్న నివర్..! అప్రమత్తంగా యంత్రాంగం..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్రానికి నివర్ తుఫాను ముప్పు పొంచి ఉంది. నివర్ తుఫాను తమిళనాడు తీరం వైపు దూసుకుపోతున్నది. గంటకు ఆరు కిలో మీటర్ల వేగంతో వాయువ్యదిశగా కదులుతోందని ఐఎండీ తెలిపింది. తమిళనాడులోని కడల్లోర్ కు 300 కిలో మీటర్లు, పుదుచ్ఛేరికి 310 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ఐఎండీ వెల్లడించింది. కొద్ది గంటల్లో పెను తుఫానుగా బలపడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు రాత్రికి కారైక్యాల్, మామల్లపురం మధ్య పుదుచ్ఛేరి సమీపంలో తుఫాను తీరం దాటుతుందని తెలిపింది.

ఇప్పటికే తుఫాను ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో 12 సెంటీ మీటర్ల వర్షం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఏపిలోని నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో వర్షాలు మొదలు అయ్యాయి. తుఫాను ప్రభావం నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను మూడు రోజులు సెలవులు ప్రకటించాయి. జిల్లా యంత్రాంగం అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.

నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఏపి రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని కన్నబాబు వెల్లడించారు. తుఫాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు.