జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా ఫ్రంటా?

జాతీయ పార్టీల ప్రమేయం లేకండా ఏ ఫ్రంట్ కూడా మనుగడ సాగించలేదని  ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజిక్కడ ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరుతూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తనను కోరారనీ, అందుకు తాను అంగీకరించాననీ చెప్పారు. అలాగే పోలవరం సమస్యలను, అభ్యంతరాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న తన వినతికి ఆయన అంగీకరించారనీ చంద్రబాబు పేర్కొన్నారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పోలవరం నిర్మాణం నిలిపివేయాలని కోరతున్న సంగతి తెలిసిందే. తమ రాష్ట్రంలో ముంపు ప్రాంతాలు, నిర్వాసితుల నష్టపరిహారం సమస్యలను పరిష్కరించకుండా పోలవరం నిర్మాణం కొనసాగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా బిల్లుకు తెలుగుదేశం మద్దతు కోరుతూ నవీన్ పట్నాయక్ దూత ఒకరు అమరావతిలో చంద్రబాబును కలిశారు. ఆ సందర్భంగా చంద్రబాబు పోలవరం విషయం ప్రస్తావించి చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమేనని చెప్పడంతో అందుకు ఆయన అంగీకరించారు. ఈ సంగతి తెలియజేస్తూ చంద్రబాబు త్వరలో ఒడిశా సీఎంతో పోలవరంపై చర్చించనున్నట్లు చెప్పారు.