ఎక్స్‌ప్రెస్ టివి అధినేత చిగురుపాటి జయరామ్ హత్య

 

విజయవాడ, ఫిబ్రవరి 1: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎక్స్‌ప్రెస్ టివి వ్యవస్థాపకుడు చిగురుపాటి జయరామ్ కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జాతీయ రహదారిపై కీసర సమీపంలో కారులో మృతదేహన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు హైదరాబాదుకు చెందిన చిగురుపాటి జయరామ్‌గా గుర్తించారు. ఈయన కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్‌గా,  ఎక్స్‌ప్రెస్ టివి చైర్మన్‌గా, హెమారన్ ఫార్మా కంపెనీ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోనూ ఒక బ్యాంక్‌లో డైరెక్టర్‌గా ఉన్నట్లు సమాచారం.

జయరామ్ మృతదేహంపై రక్తపు గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి కారులో పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తున్నది. జయరామ్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం అమెరికాలోని ప్లోరిడాలో నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం తెనాలి కాగా తల్లిదండ్రులు విజయవాడ కానూరులో ఉంటున్నారు.

రెండు రోజుల క్రితం జయరామ్ హైదరాబాదు నుండి విజయవాడ బయలుదేరినట్లు, ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా కారులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థికపరమైన వివాదాలే ఈ హత్యకు కారణం అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు జాతీయ రహదారిపై నందిగామ, కీసర టోల్ ప్లాజా తదితర ప్రాంతాల్లో సిసి టీవి పుటేజిలు పరిశీలిస్తున్నారు.