Chandrababu Naidu-NTR: టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు విచారణలు జరిపి కేసులు నమోదు చేయడంతో పాటు నాటి ముఖ్యమంత్రిని సైతం జైల్ కు పంపించడం కొత్త సంప్రదాయానికి దారి తీసింది.

గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ దనం దోచుకున్నారన్న అభియోగంతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తాజాగా అరెస్టు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఈ కేసులో చంద్రబాబుపై నేరం నిరూపణ అయితే పదేళ్ల వరకూ శిక్ష పడుతుందని కూడా వార్తలు వినబడుతున్నాయి.అయితే చంద్రబాబును అరెస్టు చేసిన తీరునే చాలా మంది తప్పుబడుతున్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయకుండా, సరైన ఆధారాలను సమర్పించకుండా సీఐడీ అధికారులు అరెస్టు చేయడం అనైతికమని పలువురు పేర్కొంటున్నారు. ఈ పరిణామం టీడీపీ శ్రేణులను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది.

సహజంగా రాజకీయాల్లో ప్రతిపక్ష నేతను అరెస్టు చేస్తే అది రాజకీయంగా వాళ్లకు మైలేజీ వస్తుందన్న అభిప్రాయంతో పాలకపక్షాలు అరెస్టు చేయించడానికి వెనుకాడతాయి. ఆ ధీమాతోనే చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన పలు కేసులు నమోదు అయినా వాటిపై కోర్టు ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకోలేదు. తాజాగా చంద్రబాబును సీఐడీ అదికారులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ నేతలతో సహా పలు ఇతర రాజకీయ పక్షాలు తప్పుబడుతున్నాయి. ఖండిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ నేత నారాయణ, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తున్నారు.

ఇదే క్రమంలో కుటుంబ సభ్యులు చంద్రబాబుకు బాసటగా నిలిచారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి, బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు సీఐడీ అదుపులో ఉన్న సమయంలో కలిసి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టుపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా.. జూనియర్ ఎన్టీఆర్ సొంత కుటుంబ సభ్యుడు అయి ఉండి కూడా స్పందించకపోవడం అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హజరు కాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణకు దూరంగా ఉన్నారు.

2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ .. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయనను నాారా లోకేష్ కోసం పార్టీ అధినేత చంద్రబాబు దూరం పెట్టారా..లేక నారా కుటుంబాన్ని జూనియర్ యే దూరంగా పెట్టారా అనేది ఎవరికీ తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పూర్తి గా సినిమాలపైనే పొకస్ కొనసాగిస్తున్నారు. గతంలో రాజకీయాలకు తన వయసు సరిపోదని, సినీ కేరీర్ యే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు తారక్. జూనియర్ ప్రస్తుతం రాజకీయపరంగా స్పందిచకపోయినా కుటుంబ సభ్యుడిగా అయినా చంద్రబాబు అరెస్టుపై స్పందించాలి కదా అని నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ స్పందించకోపవడం పై టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మామగారు వైసీపీలో ఉన్నందున ప్రభుత్వంపై వ్యతిరేకంగా స్టెట్ మెంట్ ఇచ్చినట్లు అవుతుందని సైలెంట్ గా ఉన్నారా లేక తనను వాడుకుని పక్కన పెట్టినందుకు బాగా జరిగిందిలే అని చాలా హాపీగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది.