పాక్ ఉగ్రవాదుల సముందర్ జిహాద్!

పాక్‌ ఉగ్రవాద సంస్థలు  నీటి అడుగు నుంచి దాడులకు సంబంధించి శిక్షణను తమ కేడర్ కు ఇస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం హోంశాఖ సహాయ  మంత్రి హన్స్ రాజ్ అహిర్ చెప్పారు.   సముద్రం అడుగు నుంచి దాడులకు పాల్పడే విధానాన్ని ఉగ్రవాదులు సముందర్  జిహాదీగా పిలుస్తున్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల  సమయంలో హన్స్  రాజ్ అహిర్  ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. సముద్రం అడుగు నుంచి దాడులు చేయడానికి ఉగ్రవాదులు చాలా కాలంగా శిక్షణ  పొందుతున్నారన్న స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు.

అయితే భారత్‌పై పాక్‌ ఉగ్రవాదులు మరోసారి భారీ దాడులకు పాల్పడతారన్న సమాచారం కేంద్రం వద్ద లేదని స్పష్టం చేశారు. 26/11 తరహా దాడులకు పాక్ ప్రేరేపిత  ఉగ్రవాదులు దాడులకు పాల్పడనున్నారని వస్తున్న వార్తలపై  సభ్యులు అడిగిన ప్రశ్నకు హన్స్ రాజ్ అహిర్ బదులిస్తూ నిఘా  సంస్థల  సమాచారాన్ని ఎప్పటికప్పుడు  సమీక్షిస్తూ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు  సిద్ధంగా  ఉన్నట్లు చెప్పారు.