దిగివచ్చిన పాక్ ప్రధాని

ఇస్లామాబాద్: భారత్‌తో చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేయడం, తదనంతర పరిణామాల్లో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకోవడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బింకం వదిలి రాజీమార్గానికి వచ్చారు.

రెండు రోజుల క్రితం భారత్ యుద్ధానికి దిగితే సమర్థవంతంగా తిప్పికొడతామని పేర్కొన్న  ఇమ్రాన్ ఒక్క సారిగా యుద్ధం ఇరు దేశాలకు మంచిది కాదంటూ హితవు పలుకులకు దిగారు.

‘యుద్ధం మొదలయితే ఎక్కడి వెళుతుందో ఎవరికి తెలియదు, తరువాత నా చేతుల్లో, మోది చేతుల్లో ఏమీ ఉండదు అని’ ఇమ్రాన్ అన్నారు. మా భూభాగంలోకి మీరు వచ్చారు. మీ భూభాగంలోకి మేము వచ్చాం అని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు.

‘పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలు సార్లు విజ్ఞప్తి చేశాం, అయినా భారత్ నుండి ఎటువంటి స్పందన రాలేదు, పుల్వామా ఘటన, ఇతర అంశాలపై చర్చకు తాము సిద్ధం’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.

పాక్ ప్రజలను ఉద్దేశించి ఇమ్రాన్ బుధవారం ప్రసంగించారు.