పాక్ డ్రోన్ కాల్చివేత

పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత భద్రతా దళాలు కాల్చి వేశాయి. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్‌ సరిహద్దుల్లో చోటుచేసుకుంది.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్‌-2000 యుద్ద విమానాలతో దాడులు చేసిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పాక్‌ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్‌ రూమ్‌లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

మెరుపు దాడి అనంతరం భారత్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. త్రివిధ దళాలకు సెలవులను రద్దు చేసింది.

ఈ క్రమంలో, ఈ ఉదయం 6.30 గంటల సమయంలో గుజరాత్-పాక్ సరిహద్దుల్లో ఒక డ్రోన్ సంచారాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన దళాలు డ్రోన్‌ను కాల్చి వేశాయి.

దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌లలో హైఅలర్ట్‌ ప్రకటించగా ఈ ఘటనతో గుజరాత్‌లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.