కన్నకొడుకును మర్చిపోయి ఫ్లైట్ ఎక్కారు.. చివరికి?

సాధారణంగా మనం ప్రయాణాలు చేసేటప్పుడు మనం ప్రయాణించే వాహనాలలో పర్స్, సెల్ ఫోన్, లగేజ్ బ్యాగ్ ఇలాంటివి మర్చిపోయి, హడావిడిగా వెళ్తుంటారు. తీరా ఇంటికి వెళ్లి చూసుకుంటే అవి మన వెంట తీసుకుపోవడం మర్చిపోయామనే విషయం గుర్తుకు వస్తుంది. ఇలాంటి వస్తువులు మర్చిపోవడం సర్వసాధారణమే. కానీ ఏకంగా కన్న కొడుకుని ఎవరైనా మర్చిపోతారా? కన్న కొడుకుని తల్లిదండ్రులు ఇద్దరు కారులోమర్చిపోయి వెళ్లిపోయిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..కోల్‌కతా నుంచి లక్నో వెళ్లడానికి ఓ కుటుంబం మంగళవారం సాయంత్రం కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఫ్లైట్ సమయం దగ్గర పడటంతో కంగారు కంగారుగా టాక్సీ డిక్కీ నుంచి లగేజ్ తీసుకుని వారు విమానం ఎక్కి లక్నో చేరుకున్నారు. ఆ సమయంలో వారు కారులో నిద్రిస్తున్న తన ఆరేళ్ల కుమారుడిని వెంట తీసుకు వెళ్లడం మర్చిపోయారు.

లక్నోలో వారి ఇంటికి చేరుకున్నాక కొడుకు ఏమైయ్యాడా అని ఆరా తీయగా వారికి అసలు విషయం గుర్తొచ్చింది. ఆ ఘటన నుంచి వెంటనే తేరుకుని వారు కంగారుగా వారు వచ్చిన టాక్సీకి కట్టిన బిల్లుపై ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా కోల్‌కతాలోని ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి జరిగిన విషయం తెలియజేశారు. ఎలాగైనా తమ కొడుకును కాపాడాలని ఆ తల్లిదండ్రులు పోలీసులను ప్రాధేయపడ్డారు.

ఈ విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు అధికారులు విమానాశ్రయ అధికారులను ఆశ్రయించి అక్కడ నమోదైన టాక్సీ నెంబరు ఆధారంగా టాక్సీ డ్రైవర్ తో ఈ విషయం గురించి మాట్లాడి, కారు వెనుక సీట్లో పిల్లాడు నిద్రిస్తున్నాడేమో చూడమని అధికారులు ఆ డ్రైవర్ కు చెప్పగా, అప్పటికి ఆ బాలుడు కారు వెనక సీట్లో నిద్రపోతూ ఉండడం చూసి డ్రైవర్ ఆశ్చర్యపోయాడు.

ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్ మాట్లాడుతూ నా 14 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలేదని తెలియజేశారు. అనంతరం ఆ బాలుడిని టాక్సీ డ్రైవర్ విమానాశ్రయ అధికారులకు అప్పగించగా, లక్నో నుంచి వారి తల్లిదండ్రులను రప్పించి ఆ అబ్బాయిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.